అక్కడ ట్రంప్.. ఇక్కడ కేసిఆర్

First Published Dec 1, 2017, 1:39 PM IST
Highlights
  • కేసీఆర్ కుటుంబ పాలనపై మండిపడ్డ కోమటిరెడ్డి
  • మిర్యాలగూడ లో పర్యటించిన కోమటిరెడ్డి
  • మిర్యాలగూడ జిల్లా ను కాంగ్రెస్ హయాంతో ఏర్పాటుచేస్తామని హామీ

అమెరికాలో ట్రంప్ కుటుంబ పాలన మాదిరిగానే తెలంగాణలోను కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వాళ్ల పాలనలో కుటుంబ సభ్యులకే తప్ప మిగతా పార్టీ సీనియర్లకు, నాయకులకు ప్రాధాన్యతే ఉండదని ఎద్దేవా చేశారు. రెండు కుటుంబాల స్వరూపం ఒకటే కావడంతో  హైదరాబాద్ కు విచ్చేసిన ఇవాంక కు ఇంత పెద్ద ఎత్తున గౌరవించారని కోమటిరెడ్డి కేసీఆర్ కుటుంబ పాలనపై మండిపడ్డారు. 

కోమటిరెడ్డి మిర్యాలగూడలో పర్యటనలో భాగంగా పట్టణంలోని రాజీవ్‌భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని 2019 లో గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ తగాదాలు లేవని, అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నమని కొమటిరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు సీఎం అయినా ఫరవాలేదని, కానీ టీఆర్ఎస్ ను మరోసారి గద్దెనెక్కకుండా పనిచేస్తామన్నారు.

అలాగే తమ ప్రభుత్వం ఏర్పడగానే మిర్యాలగూడ జిల్లాను ఏర్పాటుచేయించే భాద్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. 

ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు దోచి పెడుతోందని ఆరోపించారు. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకే రంగులు మార్చి తమ హయాంలో నిర్మించినట్లు టీఆర్ఎస్ కలరింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కమీషన్ల కక్కుర్తికే కాంట్రాక్టర్ల అక్రమాలను ప్రభుత్వ పెద్దలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

ఈ సమావేశంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి కోమటిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని కోమటిరెడ్డి సూచించారు.
 

click me!