
బికాం లో ఫిజిక్స్ చదివానని చెప్పుకుని సంచలనం సృష్టించిన టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు మంత్రి పదవి దక్కకపోయినా ఒక కీలక పదవి వరించింది. ఆయనతోపాటు మరికొందరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది ఎపి సర్కారు. జలీల్ ఖాన్ కు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆయన బికాం లో ఫిజిక్స్ చదివానంటూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయనకు మంత్రి పదవి దక్కకుండా చేసిందన్న విమర్శలూ ఉన్నాయి.
తాజాగా ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్పొరేషన్ల, వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడెమీ, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలకు చైర్మన్లను నియమించారు. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ ఎనిమిది మంది చైర్మన్ల నియామకం జరిగింది. ముస్లిం సోదరుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు, ఏపీ ఉర్దూ అకాడెమీ నియామకంలో నిర్ణయాలను వెల్లడించారు.
ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ (కృష్ణా జిల్లా)ను ఎంపిక చేశారు.
ఏపీ ఉర్దూ అకాడెమీ కి డాక్టర్ ఎస్. ఎండీ. నౌమాన్ (కర్నూలు జిల్లా) ఎంపికయ్యారు.
స్టేట్ ఫుడ్ కమిషన్ కు జె.ఆర్. పుష్పరాజ్(గుంటూరు) నియమితులయ్యారు.
ఏపీ ఫిలిం టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అంబికా కృష్ణ(పశ్చిమ గోదావరి) నియామకం.
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కు సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు జిల్లా) నియామకం.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా)కు జి. నరసింహ యాదవ్(చిత్తూరు) నియామకం.
లెథర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్ కాప్)కు జి. ఎరిక్షన్ బాబు ( (ప్రకాశం) నియామకం.
మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పి. ప్రకాశం నాయుడు ( అనంతపురము) నియామకం.
వీరందరినీ ఆయా సంస్థలకు చైర్మన్ లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెసింది.