ఏపిలో కెసిఆర్ కు అంత క్రేజ్..ఎందుకబ్బా ?

First Published Jan 9, 2018, 1:00 PM IST
Highlights
  • రాజకీయాలు ఎంత విచిత్రంగా మారిపోతుంటాయో?

రాజకీయాలు ఎంత విచిత్రంగా మారిపోతుంటాయో? ఓ చిన్న సంఘటన వల్ల హీరోలు జీరోలుగాను జీరోలు హీరోలుగా క్రేజ్ తెచ్చేసుకుంటారు. ఇపుడీ విషయం ఎందుకంటే, చంద్రబాబునాయుడు, కెసిఆర్ ల గురించి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టే. ఇంతకీ మ్యాటరేమిటంటే, ఏపిలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై అశక్తి పెరుగుతోంది. ఒకవైపేమో తెలంగాణాలో ఎక్కడా  కాలు కూడా పెట్టేందుకు చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో ఏపిలో కెసిఆర్ కు మాత్రం క్రేజ్ పెరిగిపోతోంది. రెండు విషయాలను దగ్గర నుండి గమనిస్తున్న వారికి ఈ డెవలప్మెంట్లు విచిత్రంగానే కనిపిస్తున్నాయి.

2014 ఎన్నికల సమయానికి సమైక్య రాష్ట్రంలో చంద్రబాబుకు పెద్ద ఇమేజే ఉంది. కెసిఆర్ విషయానికి వస్తే సీమాంధ్రప్రాంతంలో బద్ద శతృవుగా చూసేవారు. సీమాంధ్ర ద్రోహిగా చూసారు. కెసిఆర్ ఫొటోకు చెప్పులు, చీపుర్లు వేలాడదీసి చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు కూడా జరిపారు. అటువంటిది మూడున్నరేళ్ళల్లో సీన్ మొత్తం మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు స్వేచ్చగా తెలంగాణాలో తిరగలేకపోతున్నారు. అదే సమయంలో కెసిఆర్ కు ఏపిలో మద్దతు పెరుగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత కెసిఆర్ ఏపిలో ఐదు సార్లు పర్యటించి ఉంటారు. మొక్కు తీర్చుకునే పేరుతో తిరుపతి, విజయవాడకు వెళ్ళారు. పరిటాల శ్రీరామ్ వివాహం పేరుతో అనంతపురం జిల్లాకు వెళ్ళారు. అమరావతి శంకుస్ధాపనకు, చంద్రబాబును కలవటానికి విజయవాడకు వెళ్ళారు. అమరావతి శంకుస్ధాపన, చంద్రబాబును కలవటానికి విజయవాడకు వెళ్ళటం మినహాయిస్తే మిగిలిన మూడు సార్లు కెసిఆర్ క్రేజ్ స్పష్టంగా బయటపడింది.

శంకుస్ధాపన కార్యక్రమంలో కూడా కెసిఆర్ మాట్లాడుతారని ప్రకటించగానే జనాలు పెద్ద ఎత్తున కెసిఆర్ కు మద్దతుగా నినాదాలు చేయటంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. తర్వాత శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వెళ్లినపుడు రేణిగుంట-తిరుపతి మధ్యలో కెసిఆర్ కు మద్దతుగా భారీ పోస్టర్లు వెలవటం కూడా సంచలనం రేకెత్తించింది. మొన్న పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైనపుడైతే కెసిఆర్ కనబడగానే జనాలు విపరీతంగా స్పందించారు. అక్కడే ఉన్న చంద్రబాబును కూడా అపుడెవరూ పట్టించుకోలేదట. ఇక తాజాగా కెసిఆర్ కు విజయవాడ నడిబొడ్డులో ఏకంగా పాలాభిషేకమే జరగటంపై పెద్ద చర్చే మొదలైంది. చూడబోతే ఏపిలో కూడా భవిష్యత్తులో కెసిఆర్ హవా నడుస్తోందేమో అన్న అనమానాలు మొదలయ్యాయి.

click me!