
తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం ఆదివారం అయిదో రోజుకు చేరింది. ఆగస్టు 2వ తేదీ వరకు ముద్రగడకు పోలీసులు గృహ నిర్బంధం విధించారు. దీంతో భారీ ఎత్తున కిర్లంపూడిలో సాయుధ బలగాలు మోహరించడంతో ముద్రగడ ఇంటికే పరిమితమయ్యారు. అయితే బందోబస్తును సడలించిన వెంటనే పాదయాత్ర చేపట్టే యోచనలో ముద్రగడ ఉన్నారు. అంతవరకు ఇంట్లోనే గడపాలని నిర్ణయించారు. సాయుధ బలగాల గస్తీ కొనసాగుతోంది.
ఈ రోజు కూడా పోలీసు గస్తీలో ఏ విధమైన మార్పు లేదు! కేంద్ర, రాష్ట్ర బలగాల మొహరింపుతోగ్రామంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. పాదయాత్ర కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజ ప్ప మరోసారి ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో అనుమతి కోరే ప్రసక్తి లేదని ముద్రగడ భీష్మించుకొని కూర్చున్నారు. పోలీసు బలగాలు వెళ్ళిన వెంటనే నిరవధిక పాదయాత్ర ప్రారంభిస్తానని, అంతవరకు ఇంట్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు.
గృహ నిర్బంధంలో ఉన్న ముద్రగడ కాపు జెఎసి నేతలతో శనివారం కూడా సమావేశమయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన కాపు నేతలు, అభిమానులు కిర్లంపూడి వెళ్ళేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి.
ముద్రగడ వెంట ఎవరూ వెళ్లవద్దు: చినరాజప్ప
పాదయాత్ర చేసేందుకు అనుమతి కావాలని ముద్రగడ పద్మనాభం కోరితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కాకినాడలో శనివారం చినరాజప్ప విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు పాదయాత్ర చేసిన సందర్భంలో కాపులను బిసిలుగా గుర్తిస్తామని చెప్పిన మాట వాస్తవమేనని, ఆ హామీని చంద్రబాబు నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. అందులో భాగంగానే కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేశారని, విద్యానిధి పథకాన్ని కాపు యువతకు అమలుచేస్తున్నారన్నారు. త్వరలో మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వనుందని, దాని ఆధారంగా కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తారని వ్యాఖ్యానించారు. ముద్రగడ మాటలను కాపులు నమ్మవద్దని, ఆయన వెంట ఎవరూ వెళ్లవద్దని సూచించారు.