ఓట్ల చీలికే కాంగ్రెస్ కొంపముంచింది

First Published Dec 18, 2017, 8:00 PM IST
Highlights
  • గుజరాత్ ఫలితాల సరళిని గమనిస్తే కాంగ్రెస్ ఓటమికి ఓట్ల చీలికే ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది.

గుజరాత్ ఫలితాల సరళిని గమనిస్తే కాంగ్రెస్ ఓటమికి ఓట్ల చీలికే ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది. ప్రభుత్వ, బారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లను ఐకమత్యంగా ఉంచటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విపలమైంది. అంటే ఓట్ల చీలికే కాంగ్రెస్ కొంపముంచిందని చెప్పక తప్పదు. మోడి లాంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలన్నపుడు వ్యూహాలు బాగా పకడ్బందీగా ఉండాలన్న కనీస జాగ్రత్తలు కూడా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు (అప్పటికి ఉపాధ్యక్షుడే) రాహూల్ గాంధి తీసుకున్నట్లు కనబడలేదు.

గెలుపుపై అతి విశ్వాసం, ప్రత్యర్ధి శక్తిని తక్కువ అంచనా వేయటం లాంటి అనేక కారణాలతో కాంగ్రెస్ దెబ్బతిన్నది. కాకపోతే పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయన్నది ఒక్కటే పార్టీకి సంతోషం మిగిల్చి ఉంటుంది. భాజపా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుందంటే ప్రతిపక్షాల్లోని అనైక్యతే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. భాజపా, కాంగ్రెస్ లు మొత్తం 182 సీట్లకూ పోటీ చేసాయి. వాటితో పాటు బిఎస్పీ, ఎన్సీపీలు కూడా అన్నీ సీట్లకూ పోటీ చేయటం గమనార్హం.

బలం లేకపోయినా ఎన్సీపీ, బిఎస్పీలు అన్నీ సీట్లకూ పోటీ చేయటం వల్ల  అవి దెబ్బతినటమే కాకుండా కాంగ్రెస్ విజయావకాశాలను కూడా దెబ్బతిసాయి. చాలా నియోజకవర్గాల్లో గెలిచిన భాజపా అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీలు 2 వేల ఓట్ల లోపే. ఒకవేళ కనీసం ఎన్సీపీ, బిఎస్పీ లాంటి పార్టీలతో అయినా కాంగ్రెస్ జత కట్టి కూటమిగా పోటీ చేసుంటే ఓట్ల చీలికను నివారించే అవకాశం ఉండేది. అప్పుడు కచ్చితంగా కాంగ్రెస్ కూటమి మరిన్ని సీట్లు గెలిచే అవకాశం ఉండేది.

ఫలితాల సరళిని చూసిన తర్వాత ఎవ్వరైనా ఆ విషయం ఒప్పుకుని తీరాల్సిందే. ఇక్కడే రాహూల్ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ఒకవేళ కూటమిగా పోటీ చేసిఉంటే అధికారంలోకి కాంగ్రెస్ కూటమే వచ్చేది కానీ ఇంకో పార్టీకి అవకాశం లేదు. మరి రాహూల్ ఎందుకు ఆ దిశగా చొరవ తీసుకోలేదో తెలీటం లేదు. కనీసం కూటమిగా ఏర్పాటవ్వటానికి రాహూల్ తరపునుండి ప్రయత్నం జరిగినట్లు కూడా కనబడలేదు. కాబట్టే, కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికల ఫలితం ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది.

 

click me!