ఎక్స్ ప్రెస్ న్యూస్ : జనగామలో కొనసాగుతున్న ప్రతిపక్ష నాయకుల అరెస్టులు (వీడియో)

First Published Oct 21, 2017, 9:42 PM IST
Highlights

విశేష వార్తలు

  • సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్షనాయకుల నిర్భందం
  • మాజీ మంత్రి శ్రీధర్ బాబు పై కేసు నమోదు
  •  లిప్ట్ తగిలి బాలుడి మృతి
  • హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి
  • రైలు ప్రమాదంలో 300 గొర్రెల మృతి

తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్‌ కింద ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా 4,540 పోస్టులు మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా 3,900 పోస్టులు అవసరం కాగా, అప్‌గ్రేడ్‌ చేసిన 13 ఏరియా ఆసుపత్రుల్లో మరో 640 పోస్టులు అవసరమని అధికారులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని పెంచాల్సి ఉన్నందున వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

గన్నవరం లో భారీ అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లాలోని గన్నవరం రాయ్ నగర్ స్టేట్ బ్యాంకు రోడ్డులో షార్ట్ సర్కూట్ కారణంగా ఓ ఇళ్లు అగ్నికి అహుతైంది. ఉదయం 8గంటల ప్రాంతంలో వంటగదిలో విద్యుత్తు బోర్డు నుంచి మంటలు వ్యాపించాయి. ఇంటి పైకప్పు పై తాటిఆకులు వాడటంతో మంటలు ఆధికమై ఇంట్లోని వస్తువులని బూడిద గా మారాయి. ఈ ఇంట్లో యాజమాని అనంతనేని రవికుమార్ తో పాటు, రెండు కుటుంబాలు అద్దెకు నివాసముంటున్నారు. అద్దెకున్న అన్నం సోమయ్య తన కూతురు కట్నం కోసం ఇళ్లు అమ్మి బీరువాలో దాచిపెట్టిన 4లక్షల నగదు, 5 తులాల బంగారం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.అలాగే మరో కుటుంబానికి చెందిన లక్షన్నర ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న   అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పుతున్నారు.
 
 

''కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పోరాడుతున్నందుకే నా పై కేసు''

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాడని మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నందుకే ప్రభుత్వం కక్ష కట్టిందని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు బనాయించి, ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుందని అన్నారు. ప్రభుత్వం మా పై  కావాలని బురుద జల్లుతోందని, అందుకోసమే పోలీసులపై ఒత్తిడి తెచ్చి నాపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి సేవ చేసే కుటుంబంగా మా కుటుంబానికి గుర్తిపు ఉంది, దాన్ని చెడగొట్టాలని తనపై అనవసర అబాండాలు వేస్తోందని అన్నారు. తనపై నమోదుచేసిన అక్రమ కేసును లీగల్ గానే ఎదుర్కుంటానని, వారికి బయపడి వెనక్కి తగ్గేది లేదని శ్రీధర్ బాబు తెలిపారు.
 

''పాండవుల గుట్ట ను కాపాడుకుంటాం''
 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పురాతన సంపద అయిన పాండవుల గుట్టను ప్రత్యేక ''పర్యావరణ జోన్'' గా ప్రకటించాలని తెలంగాణ పాండవుల గుట్ట పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కొండ ప్రాంతాల్లో లభించే డోలమైట్ ఖనిజంపై కన్నేసిన కంపెనీలు వాటిని పొందడానికి ఇప్పటికే మైనింగ్ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు వారు తెలిపారు. అందుకు నిరసనగా పాండవుల గుట్ట పరిరక్షణ సమితి ఆద్వర్యంలో  స్థానికులు ,  రచయితల వేదిక నాయకులు ర్యాలీ చేపట్టారు. వెంటనే ఈ ప్రాంతంలో ఖనిజాల తవ్వకం కోసం ఇచ్చిన క్వారీల అనుమతులు రద్దు చేసి సహజ ప్రాకృతిక, పురావస్తు సంపదను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. 

జనగామలో ప్రతిపక్ష నాయకుల అరెస్టులు (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుల అరెస్టులు జోరందుకున్నాయి. సీఎం పర్యటనకు అడ్డు తగులుతారనే అనుమానంతో ఈ నిర్భందాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో ప్రతిపక్ష   సీపిఎం పార్టీకి చెందిన బూడిద గోపి , బొట్ల శ్రీనివాస్ లను, సిపిఐ కి చెందిన రాజారెడ్డి,  టీడిపి నాయకులు చీకట్ల నవీన్ లను పోలీసులు నిర్భందించారు. అంతేకాకుండా జేఏసి జిల్లా నాయకులు ఆకుల సతీష్,తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు కొండo కుమార్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీన్నివ్యతిరేకిస్తూ కొందరు ప్రతిపక్షనాయకులు జనగామ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.   

తిరుమల లో తల్లీ కొడుకుల ఆత్మహత్య
 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయం సమీపంతో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి.  కొండపై వున్న రాతి మంటపం సమీపంలో ఓ మహిళతో పాటు మరో వ్యక్తి మృతదేహం లభ్యమయింది. వీరిద్దరు తల్లి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు చిత్తూరు జిల్లాకే చెందిన పుష్పా, శేఖర్ లుగా, అప్పుల భాదతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.    

''ఐలయ్య వెనుక విదేశీహస్తం'' 

కంచ ఐలయ్య సమాజంలోని ఆర్యవైశ్యులను, బ్రాహ్మణులను కించపరుస్తూ పుస్తకాలు రాస్తున్నారని, ఐలయ్య వెనుక విదేశీ హస్తం ఉందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. విదేశీ డబ్బుతో హిందూ సమాజంపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ మల్కాజిగిరిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం ఆడిటోరియంలో ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హిందుత్వంపై దాడి - కంచ ఐలయ్య’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ రాంచందర్‌రావు.. ఐలయ్య, ఆయన రచనల వెనుక ఉన్న శక్తులపై సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దేశద్రోహి కేసు నమోదు చేసి ఐలయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని అన్నారు. కాగా, కంచ ఐలయ్య దేశాన్ని, హిందుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని కసిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హిందూ సమాజం ఆయనకు తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు.
 

 చైతన్యపురిలో పట్టపగలే దొంగల హల్ చల్

హైదరాబాద్: చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగల హల్ చల్ సృష్టించారు. ఫణిగిరి కాలనీ లో నివాసముంటున్న ప్రత్యూష (28) అనే మహిళ పై మత్తు మందు ప్రయూగించి, ఆమె మెడలో ఉన్నమూడున్నర తులాల పుస్తెల తాడును దొంగలు అపహరించుకుని వెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు పిర్యాధు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అయితే ఇలా స్ప్రే కొట్టి నగల అపహరణ చేయడం రాచకొండ దిల్ షుక్ నగర్ ప్రాంతంలో తరచూ పెరుగుతుండటంతో మహిళలు ఇంటి బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇలాంటి దొంగతనమే సరూర్ నగర్ పరిధిలో జరిగ్గా, మరోసారి ఇలాంటి దొంగతనమే జరగడం ఆందోళన కల్గిస్తోంది. 

మాజీ మంత్రి శ్రీధర్ బాబు పై కేసు నమోదు

మాజీ మంత్రి శ్రీదర్ బాబు పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యంది.కరీంనగర్ జిల్లా  మంథని నియోజకవర్గం ఓడేడు గ్రామ మాజీ సర్పంచ్‌ కిషన్‌రెడ్డి ఫిర్యాదుతో  ఎన్డీఫీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముత్తారాం మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని గంజాయి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారని మంత్రిపై ఆరోపణలున్నాయి. సుదర్శన్ అనే వ్యక్తితో ప్లాన్ గురించి శ్రీధర్ బాబు మాట్లాడిన వాయిస్ రికార్డ్ ని పోలీసులకి అందించాడు బాధితుడు కిషన్ రెడ్డి. దీంతో శ్రీధర్ బాబు తో పాటు అతడి అనుచరులు సుదర్శన్, భార్గవ లపై కూడా  పోలీసులకు  కేసు నమోదు చేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడైన శ్రీదర్ బాబు ను కావాలనే అధికార పక్షం టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించిందని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. దీనిపై మాజీ మంత్రి గాని, అతడి అనుచరులు గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.  

డిల్లీ మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు

ఓ డిల్లీ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించిన క్యాబ్ డ్రైవర్ ను సైబరాబాద్ షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి  ఒబేర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఓ డిల్లీ మహిళ మాదాపూర్ నుండి ఢిల్లీ కి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇతగాడి క్యాబ్ లో బయలు దేరింది. ఆమె ఒంటరితనాన్ని అదునుగా తీసుకుని డ్రైవర్ ప్రేమ్ కుమార్ అసభ్య ప్రవర్తించాడు. దీంతో ఆమె ఢిల్లీకి వెళ్లాక అక్కడ సబ్ధర్ జంగ్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు గురించి డిల్లీ పోలీసులు  సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన షీ టీమ్ బృందాలు మాదాపూర్ లో అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడి పై ఐపీసీ 354 A,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

హైదరాబాద్ : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మన్ ఘాట్ లో దారుణం జరిగింది. దుర్గానగర్ లో సత్యసాయి అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ తగిలి వెంకట తస్సావంత్ అనే 10 సంవత్సరాల బాబు మృతి చెందాడు.  ఎలాంటి రక్షణ లేని లిప్ట్ లోకి తొంగి చూస్తుండగా పై నుడి వచ్చిన లిప్ట్ తలకి బలంగా తగలటం తో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు, భందువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

హైదరాబాద్ లో భూకంపం

హైదరాబాద్ లో నగరంలో  ఇవాళ తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే దారిలో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి. రహ్మత్‌నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ ప్రాంతాల్లో ఉదయం 3 నుంచి 3.30 గంటల ప్రాంతంలో భూమి స‍్వల‍్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. 
భూమి కంపించిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. 
 

తెలంగాణలో 300 సబ్సిడీ గొర్రెలు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా : రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెంలో రైలు డీకొని సుమారు 300 గొర్రెలు చనిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా సబ్సడీపై వచ్చిన గొర్రెలు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో లబ్ధిదారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కేతేపల్లి గ్రామానికి చెందిన కొందరు యాదవులు తమ గొర్రెల మేత కోసం వలస వెలుతుంటారు. అలాగే వారు కొమ్మాయిగూడెంకు వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్ పరిసరాల్లో గొర్రెలు మేపుతున్నారు. అయితే అను అనుకోకుండా రైలు ప్రమాదంలో జరగడంతో గొర్రెలన్ని మృతి చెందాయి.  ఈ ప్రమాదంతో తమ 8 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని భాధితులు ఆవేదన చెందుతున్నారు.

click me!