ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

Published : Aug 16, 2017, 11:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

సారాంశం

యోగితా రాణాను హైద్రాబాద్ కు బదిలీ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసిన  తెలంగాణ సర్కారు   మిష‌న్ భ‌గీర‌థ  ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కర్ణాటకలో  ‘ఇందిరా క్యాంటీన్‌’ లను ప్రారంభించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోదండరామ్ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సచివాలయంలో  సమీక్ష సమావేశం

 

 

భూనిర్వాసితులకు అండగా ఉంటాం

పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిపిన భూసేకరణలో భాదితులకు అన్యాయం జరిగితే ఊరుకోమని మాజీ మంత్రి శ్రీదర్ బాబు హెచ్చరించారు. భూములు తీసుకునేటపుడు రైతులను బుజ్జగించిన ప్రభుత్వం,   నష్టపరిహరం అడిగితే భయపెడుతారా అంటు ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని మండలం సిరిపురం గ్రామంలో సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులను ఆయన కలుసుకున్నారు.  అలాగే పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన చంద్రమోహన్ ను కలిసి  సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
 

అడ్డంకులు లేకుండా ఉద్యోగ ప్రకటనలు వెలువరించడం ఎలా?
 

ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయపర అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు న్యాయపర ఇబ్బందులు రాకుండా వేగంగా నియామకాలు చేసేందుకు  విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, టిఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, టిఎస్పీఎస్సీ మెంబర్ సెక్రటరీ వాణి ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావులు పాల్గొన్నారు. 
ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో మరోసారి ఇదే అంశంపై సమావేశం కావాలని నిర్ణయించారు. 
 

దళితులను కించపర్చేలా మాట్లాడిన ఏపీ మంత్రి

ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో దళితులను కించ పరిచేలా మాట్లాడారని ఎమ్మార్సిఎస్  రాష్ట్ర అధ్యక్షులు బండి వీరయ్య మాదిగ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దళితుల గురించి తప్పుగా మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని వీరయ్య డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాల మహానాడు (కారెమ్ శివాజీ) రాష్ట్ర కార్యదర్శి నమంగదొడ్డి సింగరయ్య,  బీ.జె.పీ.దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు , ఎల్లయ్య మాదిగ లు పాల్గొన్నారు. క్షమాపన చెప్పకుంటే  ఆదినారాయణరెడ్డి ని ప్రభుత్వం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు.

అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన కంపెనీ   

అగ్రిగోల్డ్ అస్తులను కొనుగోలు చేసేందుకు కొత్త కంపెనీ ఒకటి ముందుకు వచ్చింది. అగ్రిగోల్డ్ అస్తులకు సంబంధించిన  డాక్యుమెంట్లు తమకు ఇస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని  ఈ కొత్త కంపెనీ  ప్రతినిధులు హైకోర్టు కు తెలిపారు. అయితే డాక్యుమెంట్లను  ఇవ్వాలంటే 100 కోట్లు డిపాజిట్ చేయాలని  హైకోర్టు ఈ కంపెనీకి తెలిపింది. 
ఈ నెల 31 వరకు అగ్రిగోల్డ్ కు గడువు ఇచ్చిన హైకోర్టు, తదుపరి విచారణను  కూడా ఈ నెల 31 కి వాయిదా వేసిది.  
 

లక్ష కాదు, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

 

నిన్న స్వాతంత్య్ర దినోత్పవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనను జేఏసీ చైర్మన్ కోదండరామ్  తప్పుపట్టారు.సీఎం చెప్పినట్లు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయడం కాదు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేసారు.  ఖమ్మంలో ఏఐవైఎఫ్‌ ఆద్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల సదస్సులో ముఖ్యఅతిదిగా పాల్గొన్న ఆయన,ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు.    
 

తెలంగాణ ప్రాజెక్టులకు అదనపు నిధులు

ప్రధాన మంత్రి క్రిషి సించాయ్ యోజన పధకం కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ పేజ్ 2, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్,రాజివ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్,ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్,పెద్దవాగు, రాలివాగు,మత్తడివాగు,కొమరం భీమ్,పాలెం వాగు,గొల్లవాగు పధకాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.ఈ పథకం కింద మొత్తంగా దేశంలోని 99 ప్రాజెక్టులకు 9020 కోట్ల నిధులను కేటాయించారు. సంవత్సరానికి 6 శాతం ‌వడ్డీ తో నాబార్డు ద్వారా ఈ నిధులను అందించాలని  కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
 

నీట్ ఉద్యోగ నియామకాలకు కేంద్ర అంగీకారం

ఆంధ్రప్రదేశ్  నీట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి ఒక డైరెక్టర్, ముగ్గురు భోదనేతర సిబ్బంది నియామకానికి కేంద్ర  కేబినెట్ అంగీకారం తెలిపింది. డైరెక్టర్ వేతనం 75 వేలు మరియు 5 వేల ప్రత్యేక భత్యం, బోదనేతర సిబ్బంది (రిజిస్ట్రారు, లైబ్రేరియన్, క్రీడాధికారి)కి 10 వేల వేతనాన్ని చెల్లించనున్నారు. 
 

స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా

 హైదరాబాద్ :  ఉప్పల్ లో స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటో బోల్తాపడి విద్యార్థులకు గాయాలయ్యాయి .  ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు కేంద్రీయ విద్యాలయం చిన్నారులకు సంఘటన స్థలంలోనే ప్రథమచికిత్స చేసి హాస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
 

కర్ణాటకలో ఇందిరా క్యాంటిన్ లు ప్రారంభం

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకోసం ఉద్దేశించిన ‘ఇందిరా క్యాంటీన్‌’ ను బుధవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రారంభించారు. డబ్బు చెల్లించి ఆయన అక్కడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. ఈ క్యాంటీన్ లలో టిఫిన్ ధర రు. 5, భోజనం రు.10 గా ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు అమ్మ క్యాంటీన్ ల తరహాలో వీటిని రూపొందించారు.
 

పోలీస్ హెడ్ క్వార్టర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ.40 కోట్లు వెచ్చించి రాజధాని అమరావతితో నిర్మించిన  పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఆదునిక సాంకేతికతతో నిర్మించిన ఈ ఐదంతస్తుల భవనంలో పలు పోలీసు విభాగాలు పనిచేయనున్నాయి. వాటిలో ముఖ్యమైన డీజీపీ, సీఐడీ, రిక్రూట్‌మెంట్‌, శిక్షణ, టెక్నికల్ కార్యాలయాలను కూడా సీఎం ప్రారంభించారు. తర్వాత డీజీపీ  సాంబశివరావు హెడ్‌క్వార్టర్స్ వివరాలను ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబుకు వివరించారు.

మహిళల కోసం షీ షటిల్ బస్ లు ప్రారంభం

మహిళల భద్రత కోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ లో షీ షటిల్ బస్ లను హైదరాబాద్ కమీషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య,  రాచకొండ సీపీ మహేష్ భగవత్ లతో పాటు  పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ  బస్సుల  కోసం  9490617111 నంబర్ ను  సంప్రదించి,  వివరాలు పొందవచ్చని పోలీసు అధికారులు  తెలిపారు.
 

త్వరలో హైదరాబాద్ కు మిషన్ భగీరథ నీరు - కేటీఆర్


హైదరాబాద్ : కొంప‌ల్లి లో జరుగుతున్న మిష‌న్ భ‌గీర‌థ పైప్ లైన్ ప‌నుల‌కు ఇవాళ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంధర్బంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు లోప‌ల ఉన్న 183 గ్రామాలు, 7 మున్సిపాలిటీల‌కు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ. 628 కోట్ల‌తో పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీలు మ‌ల్లారెడ్డి, బూర న‌ర్స‌య్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగ‌ల కృష్ణా రెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు  లు పాల్గొన్నారు.
 

హైద్రాబాద్ కలెక్టర్ గా యోగితా రాణా 

హైద్రాబాద్ కలెక్టర్ గా యోగితా రాణా నియమించారు. 2003 బ్యాచ్ కు చెందిన యోగితా  ఇంతవరకు నిజాంబాద్ కలెక్టర్ గా ఉన్నారు.  ఆమెను హైద్రాబాద్ బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో నిజామాబాద్ కలెక్టర్ గా ప్రశాంతి  ని నియమించారు.          

హత్యలకు దారితీసిన భూవివాదం 

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల ఎ౦పిటిసి భర్త బత్తుల నాగరాజుపై హత్యాయత్నం జరిగింది. ఓ భూవివాదంలో నాగరాజుపై గుర్తుతెలియని దు౦డగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో  తీవ్రంగా గాయపడిన ఆయనను హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలి౦చారు. ఈ దాడితో  మండల పరిధిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో,  పోలిసులను భారిగా మోహరి౦చారు.

చెన్నైలో తెలుగు టెకీ అదృశ్యం                        

నెల్లూరు జిల్లాకు చెందిన కంచర్ల వెంకటసాయితేజ చెన్నైలో అదృశ్య‌మయ్యారు.   ఓ సాప్ట్ వేర్ కంపెనీలో  పనిచేస్తున్న  సాయితేజ సెలవు రోజు కావడంతో మెరీనా బీచ్ కు వెళుతున్నాని సహచరులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.  రాత్రంతా ఎదురుచూసిన సహచర స్నేహితులు, ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు సాయితేజ్ కు ఏదైనా ప్రమాదం జరిగిందా.?  లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా.. అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు.  

 

నిర్మాణంలో వున్న గోడకూలి ఇద్దరు కూలీల మృతి 

 

హైదరాబాద్ : అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్న నగేష్ (38),కృష్ణ (45) లు ఆసిఫ్ నగర్ లో షిల్లర్ నంబర్ 28 వద్ద భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు.  నిర్మాణపనుల్లో వున్న వీరిపై గోడ కూలి మీద పడటంతో  అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో  ఆగ్రహించిన మృతుల భందువులు  బిల్డర్ ని, ghmc అధికారులని అరెస్ట్ చేయాలని మృతదేహాల తో బిల్డింగ్ వద్ద ధర్నా చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసారు.

శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఒమన్ భాదితులు

 ఒమన్ దేశానికి ఉద్యోగం నిమిత్తం వెళ్లి మోసపోయిన భాదితులకు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. వీరికి ఉచితంగా విమాన టికెట్లు ఇప్పించి స్వదేశానికి తీసుకువచ్చారు.  ఇవాళ దాదాపు 300 మంది గల్ఫ్ కార్మికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు.
ఉద్యోగాలు లేక, ఉన్నా యాజమాన్యం వేతనాలు ఇవ్వక  తిండి లేని రోజులెన్నో గడిపామని వారు మీడియాకు తెలిపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు భారత రాయబార సంస్థ తో పాటు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ లు దేవుడిలా ఆదుకున్నాయన్నారు.   

జిహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మృతి

జిహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన టీడిపి తరపున కార్పోరేటర్ గా గెలిచి ప్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం అతని భార్య స్వర్ణలత రెడ్డి సైదాబాద్ కార్పొరేటర్ గా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న ఆయన మరణించడం పార్టీకి తీరనిలోటని కార్యకర్తలు వాపోతున్నారు.  

రోహిత్ వేములది ఆత్మహత్యే

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేములది ఆత్మహత్యేనని కేంద్ర ప్రభుత్వ కమిటి తేల్చింది. కుల వివక్షత వల్లే రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడని  దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ యూనివర్సిటి లలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈనేపద్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేయగా, ఈరోజు  ఆ కమిటీ సమగ్ర నివేదికను కేంద్రానికి అందించింది. అందులో  రోహిత్ వేములది ఆత్మ హత్యే నని తెల్చింది.

చిన్నారిని కాపాడిన అధికారులకు అభినందనలు

బోరుబావిలో పడిన చంద్రశేఖర్ ను ప్రాణాలతో కాపాడిన ఎన్డీఆర్ ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అభినందించారు. మృత్యుంజయుడిగా  బయటపడిన చంద్రశేఖర్ కు అందుతునన్న వైద్య సేవలు గురించి ఆయన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు చినరాజప్ప.

బోరు బావిలో పడిన బాలుడు సురక్షితం

ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో బోరు బావిలో పడిన చంద్రశేఖర్ అనే  బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రాణాలతో బయటికి తీసారు.   రెండేళ్ల వయసున్న ఈ బాలుడు  తండ్రి మల్లికార్జున్‌తో కలిసి పొలానికి వెళ్లినపుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. 20 అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడిని చాకచక్యంగా బయటకు తీసిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందానికి సీఎం చంద్రబాబు అభినందించారు.


 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)