ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Sep 12, 2017, 10:56 AM IST
Highlights

విశేష వార్తలు 

  • తెలంగాణ స్పొర్ట్స్ స్కూల్ విద్యార్థులకు మంత్రి పద్మారావు అభినందనలు
  • న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకలు పోస్టర్ ను ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
  • నంద్యాల ఓటమి నైతిక బాధ్యత నాదేనంటున్న రఘువీరా రెడ్డి  
  • దసరా నాటికి సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్ అనుమతులు  
  • అన్నాడీఎంకే కార్యదర్శి పదవి నుండి శశికళను తొలగిస్తూ జనరల్ కౌన్సిల్ నిర్ణయం 

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలకు ముహూర్తం ఖరారు చేసింది.  డిసెంబర్ 15 నుంచి 19 వ తేదీ వరకు హైదరాబాద్ లో ఈ మహాసభలు నిర్వహించనున్నారు.  నిర్వహణ ఖర్చుల కోసం 30 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం కేసిఆర్ ఆధేశించారు.       

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక 

బతుకమ్మ, దసరా పండుగలు  నెలాఖరున వస్తున్నందున ఈ నెల 25నే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లించాల్సిన డిఎను విడుదల చేయాలని కూడా చెప్పారు.

రాజీవ్ స్వ‌గృహ ఇండ్ల‌పై  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఓరియంటేష‌న్ ప్రోగ్రామ్

హైద‌రాబాద్ : "ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ ఫర్ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్ " పేరిట రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగులకు  రాజీవ్ స్వ‌గృహ ఇండ్ల‌ను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే విధానంపై  గృహ నిర్మాణ శాఖ అవ‌గాహ‌న స‌దస్సును ఏర్పాటు చేసింది. ఈ నెల 14న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ర‌వీంద్ర భార‌తిలో ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్లు  తెలంగాణ రాజీవ్ స్వ‌గృహ స్టేట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ సీఈ స‌త్య‌మూర్తి  తెలిపారు. గుర్తింపు పొందిన అన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల‌కు దీనిపై ఇప్ప‌టికే స‌మాచారమిచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రాజీవ్ స్వ‌గృహ ఇండ్లను ఆన్ లైన్ లో ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో అనే దానిపై  ఉద్యోగుల‌కు వివ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు.   బండ్ల‌గూడ, పోచారంలో రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌ను కోనుగోలు చేయాల‌నే ఆసక్తి ఉన్న‌వారు  " tsswgruha.cgg.gov.in"  వెబ్ సైట్ లో వివ‌రాల‌ను చూడ‌వ‌చ్చ‌న్నారు.
 

తెలంగాణ స్పొర్ట్స్ స్కూల్ విద్యార్థులకు మంత్రి పద్మారావు అభినందనలు
 

ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో యూత్,జూనియర్, సీనియర్ విభాగాల్లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు మంత్రి పద్మారావు అభినందించారు.     తెలంగాణ స్పొర్ట్స్ స్కూల్ కు చెందిన విద్యార్ధులు  ధీక్షిత, ఆర్.వి. వరుణ్ మరియు ఆర్.వి. రాహుల్ లు ఇవాళ సచివాలయంలో మంత్రిని కలిసారు.   
ఈ సందర్బంగా మంత్రి వారిని అభినందిస్తూ 2018 లో జరిగే కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించినందుకు మరియు భవిష్యత్తు టోర్నీ లకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా వుంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ స్పొర్ట్స్ స్కూల్, హకీంపేట్ కు చెందిన విద్యార్ధులు ఈ స్థాయి లో రాణించడం చాలా సంతోషంగా వుందని మరియు ఈ పరిణామం తెలంగాణ కు గర్వకారణమని మంత్రి అన్నారు.  
 

 తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విడుదల చేసింది. రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉండనున్న ఈ నూతన పాలసీ త్వరలో అమల్లోకి రానుంది. రేపటి నుండి కొత్త వైన్ షాపుల ఏర్సాటుకు ఆన్ లైన్ అప్లికేషన్ లు స్వీకరించనున్నారు. 
అలాడే ప్రతి వైన్ షాపు ముందు కనీసం రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిభందనను ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది.  
అలాగే వచ్చే నెల 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో రాత్రి 11 గంటల వరకు వైన్ షాపులు తెరిచి వుంచేలా అనుమతించనున్నట్లు కొత్త పాలసీలో పేర్కొన్నారు.

నంద్యాల ఓటమి నైతిక బాధ్యత నాదే                        
 

నంద్యాల, కాకినాడ ఎన్నికలలో పార్టీ ఓటమికి పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి నైతిక బాధ్యత తీసుకున్నారు. ఈ రెండుచోట్ల పార్టీ పరాజయం పాలైనందుకు భాద్యత నాదేనని ఈ రోజు విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. సమావేశంలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. 
కాకినాడ, నంద్యాల ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన పార్టీ నేతలు  మనం నిరుత్సాహం  పడనవసరంలేదని రఘువీరా వ్యాఖ్యానించారు.
‘‘ఉప ఎన్నికల ఫలితాలను  మనం ప్రామాణికంగా తెసుకోవలసిన అవసరం లేదు.రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ని ఖత్తం చేద్దామని చూస్తున్నాయి. ఈ రాజకీయ ఎత్తుగడలను కాంగ్రెస్ రాబోయే రోజులలో సమర్ధవంతముగా తిప్పికొడుతుంది,’ అని ఆయన అన్నారు.  

సమావేశం గురించి రఘువీర చెప్పిన విశేషాలు

ఈ రోజు విజయవాడ లో రెండు సమావేశాలు జరిగాయి. మొదటిది మునియప్ప ఆధ్వర్యంలో నగర స్థాయిలో పార్టీ అంతర్గత ఎన్నికల గురించి ప్రధానంగా జరిగింది.రెండవ సమావేశం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యం లో నంద్యాల..కాకినాడ ఎన్నికలు జరిగిన విధానం గురించి చర్చించాం.రెండు ఎన్నికల్లోనూ ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైంది.అసలు నంద్యాల...కాకినాడ ఎన్నికలు అసలు ఎన్నికలే కాదు.టీడీపీ..వైసీపీ రెండూ బీజేపీ తొత్తులే.బీజేపీ దేశానికి ప్రమాదం.టీడీపీ..వైసీపీ లు తొడుక్కున్న బీజేపీ ముసుగును తొలగించి ప్రజలకు వాటి నిజస్వరూపాన్ని చూపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.త్వరలో రాష్ట్ర పార్టీ పరిస్థితులపై సోనియా గాంధీ వద్దకు ఒక బృందాన్ని పంపిస్తాం. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 2 నుండి నవంబర్ 19 వరకూ ఇంటింటికీ తిరిగి ఇందిరమ్మ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఇప్పటి తరానికి ప్రచారం చేస్తాం.

                   

న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత

న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకలు పోస్టర్ ను ఆవిష్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. మంగళవారం హైదరాబాద్ లో న్యూజిలాండ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిశారు. ఈ నెల 24న న్యూజిలాండ్ దేశం ఆక్లాండ్ నగరం మౌంట్ ఈడెన్ హాల్ లో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు చేస్తున్న ఏర్పాట్లు ను వివరించారు. ఈ సందర్భంగా ఎంపి కవిత న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల వాదులను కూడా అహ్వానించాలని ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో
తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ ప్రతినిధులు రాంరెడ్డి,రాజీవ్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, యూత్ రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్,దూసరి బాలాజి పాల్గొన్నారు.                        

ఇక ఆన్ లైన్ లో సినిమా షూటింగ్ అనుమతులు

దసరా నాటికి సింగిల్ విండో విధానంలో  ఆన్ లైన్ లోనే  సినిమా షూటింగ్ లకు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన ఇవాళ  చలనచిత్ర అభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ  అభివృద్ధి  కార్యక్రమాల పై  సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...దసరా నుండి థియేటర్లలో 5 వ ఆటగా చిన్న చిత్రాల ప్రదర్శన కు అనుమతులు ఇచ్చేలా ఆదేశాలు  జారీ చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ స్టూడియో నిర్మించేందుకు  అబ్దుల్లాపూర్ మెట్ మరియు కోహెడ ప్రాంతాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఆర్టీసి బస్టాండ్ లలో మినీ థియేటర్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
అలాడే ఈ నవంబర్ లో  నిర్వహించనున్న బాలల చలనచిత్రోవాలకు 8 కోట్ల రూపాయల ను విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తలపాని తెలిపారు.

హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద బిజేపి ధర్నా

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద బీజేపి నేతలు నిరసన తెలిపారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.  కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన తెలంగాణ బీజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రామచందర్‌రావులతో పాటు బీజేపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మళ్లీ బీజెపి కార్యకర్తలు అలజడి సృష్టించే అవకాశం వుండటంతో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులను మొహరించారు.
 

డిల్లీలో సమావేశమైన కేంద్ర జలవనరుల అభివృద్ధి మండలి  

న్యూఢిల్లీ : నీటి వనరులను కాపాడుకోవడం, నదుల అనుసంధానం, నదుల్లో కాలుష్య నిర్మూలన తదితర అంశాలను చర్చించడానికి కేంద్ర జలవనరుల అభివృద్ధి మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి ఇటీవల  జలవనరుల శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నితిన్ గడ్కరీ అద్యక్షత వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశమై పైన పేర్కొన్న అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ,ఏపీల నీటిపారుదల శాఖ మంత్రులు హరిష్ రావు, దేవినేని ఉమ లు పాల్గొన్నారు.
 

ముగిసిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం- పలు తీర్మానాలకు ఆమోదం

తమిళనాడు లో అన్నాడీఎంకే పార్టీలో  నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే కార్యదర్శి పదవినుండి శశికళను తొలగిస్తున్నట్లు సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే దినకరణ్ ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రెండాకుల గుర్తు కూడా మెజారిటీ పక్షమైన తమకే చెందుతుందని సమావేశంలో తీర్మానించారు.
అయితే ఈ నిర్ణయంపై స్పందించిన దినకరన్ తనను, శశికళను పార్టీ నుంచి తొలగించే అధికారం జనరల్ కౌన్సిల్ కు లేదని అన్నారు.    

కంచె ఐలయ్య పుస్తక వివాదానికి పరిష్కారం సూచించిన రోశయ్య

ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆర్య వైశ్యుల గురించి రాసిన పుస్తకంపై వివాదం చెలరేగుతున్న నేపద్యంలో, ఈ వివాదానికి పరిష్కారాన్ని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సూచించారు. వైశ్య కుల సంఘాలు కంచె ఐలయ్యతో కలిసి, కూర్చుని, చర్చించుకుని ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. సమాజం లో వివిధ వ్యక్తుల అభిప్రాయాలు వివిద రకాలుగా ఉంటాయని అంతమాత్రాన అభిప్రాయాలు ఒక్కటిగా లేవని విరోధిగా, శతృవుగా చూడాల్సిన పనిలేదన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, మన అభిప్రాయాలతో ఏకీభవించని వారితో కూడా కొన్నిసార్లు సర్దుకుపోవాలని వైశ్యులను సూచించారు. 
 

 

 

 

click me!