
బిజీ లైఫ్ స్టైల్ లేదా ఫుడ్ మిగిలిపోయినప్పుడు దానిని ఫ్రిజ్ లో పెట్టి తినేవారు చాలా మందే ఉన్నారు. చాలా మంది ఆఫీసు నుంచి వచ్చినాక తినడానికి ఉదయమే వంట చేసి ఫ్రిజ్ లో పెట్టేసి వెళుతుంటారు. అయితే ఫ్రిజ్ లో పెట్టిన వాటిని చూసే తీరిక లేనివారు కూడా ఉన్నారు. వీటిని 2,3 రోజులకు కూడా తింటుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ ను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం ఎక్కువ సేపు చెడిపోకుండా ఉంటుంది. అయితే రిఫ్రిజిరేటర్లు ఆహారంలో సాల్మొనెల్లా, ఇ.కోలి, బోటులినమ్ వంటి బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదిస్తాయని నమ్ముతారు. కానీ ఫ్రిజ్ లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచడం వల్ల దానిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇలాంటి ఆహారాలు విష పదార్ధాలుగా మారతాయి. ఫ్రిజ్ లో ఉంచిన ఫుడ్ ను తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫుడ్ పాయిజనింగ్ జరగొచ్చు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తడి ఆహారాలను ఫ్రిజ్ లో నిల్వ చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉదాహరణకు ముడి మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేస్తే దాని రసం వేరే ఆహార పదార్ధాల్లో పడుతుంది. ఇది దానిలో బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇలాంటి ఆహారాలను తింటే మీకు కడుపు సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కూడా కారణమవుతుంది.
సంక్రమణకు కారణం కావొచ్చు
మనలో చాలా మందికి ఫ్రిజ్ ను వాడే అలవాటు ఉంటుంది. కానీ వాటిని శుభ్రం చేసే తీరిక, ఇంట్రెస్ట్ అసలే ఉండదు. దీనివల్ల ఫ్రిజ్ లో దోమలు, ఈగలు, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ కీటకాలు ఆహారాలపై వాలుతాయి. దీని వల్ల ఆహారంలో ఎన్నోరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. దీంతో ఫుడ్ పాడవుతుంది. ఈ విషయం మనకు తెలియక అలాగే తినేస్తాం. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.
బ్యాక్టీరియాకు నిలయం
ఫ్రిజ్ ఫుల్ గా ఉంటే అందులోకి గాలి వెళ్లే అవకాశమే ఉండదు. ఇది ఆహారంలో ఎన్నో రకాల బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఆహారాన్ని ఫ్రిజ్ లో ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో ఎన్నో రకాల వ్యాధులకు దారితీస్తుంది. ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం కూడా పొట్టను పాడు చేస్తుంది.
పోషకాలు తగ్గుతాయి
ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల దీనిలోని పోషకాలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి పోషకాలు లేని ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరంలో విటమిన్లు, ఖనిజాలు తొలగించబడతాయి. దీంతో మీ కండరాలు బలహీనపడే ప్రమాదం ఉంది.
ఆహారం పాడైపోతుంది
పాడైపోయిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం కూడా ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ ను తినకూడదని చెబుతోంది. ఆహారాన్ని ఉడికించి తాజాగా తినాలి. ఎప్పుడో వండిని ఆహారాన్ని తింటే మీ శరీరం బద్ధకంగా, సోమరిగా మారుతుంది. తాజా ఆహారం తినడం వల్ల మన శరీరంలో ఎనర్జిటిక్ గా ఉంటుంది. అలాగే చురుగ్గా కూడా ఉంటాం.
అయితే వండని ఆహారాలను, వండిన ఆహారాన్ని విడివిడిగా ఫ్రిజ్ లో ఉంచాలి. ముడి ఆహారం నుండి బ్యాక్టీరియా వండిన ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఆహారాన్ని తిరిగి వండకపోతే బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతుంది.