వర్షాకాలంలో కీళ్ల నొప్పులు పెరుగుతాయన్నసంగతి మీకు తెలుసా? అవును ఈ విషయాన్ని మీరు కీళ్ల నొప్పులు ఉన్నవారికి అడిగితే తెలుస్తుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మాత్రం చాలా మందికి తెలియదు.
వర్షాకాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బయట వానపడుతుంటే.. ఇంట్లో వేడి వేడి లేదా బజ్జీలు, పకోడీ తింటుంటే బలే అనిపిస్తుంది. కానీ ఈ సీజన్ లో కొంతమందికి లేనిపోని రోగాలు వస్తాయి. ఉన్న రోగాలు ఎక్కువ కూడా అవుతాయి. ఈ సీజన్ లో దాదాపుగా ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడతారు. ముఖ్యంగా ఈ వానాకాలంలో కీళ్ల నొప్పులు బాగా ఎక్కువ అవుతాయి. అసలు ఒక్క వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది కీళ్ల దృఢత్వానికి కారణమవుతుంది. ముఖ్యంగా బలహీనమైన ఎముకలు ఉన్నవారిని ఈ సీజన్ చాలా ఇబ్బంది పెడుతుంది. వాతవారణం చల్లగా ఉండటం వల్ల చాలా మంది నీళ్లను అసలు తాగనే తాగరు. ఏదైనా తింటున్నప్పుడే కొన్ని నీళ్లను తాగుతారు. మిగతా టైంలో నీళ్ల జోలికే వెళ్లరు. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాతావరణంలో కనిపించే గాలి పీడనాన్ని బారోమెట్రిక్ పీడనం అంటారు. అయితే వర్షాకాలంలో ఈ పీడనం తగ్గుతుందట. దీంతో మన శరీరంలోని కణజాలాలు, కండరాల్లో వాపు, నొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రత.. కణజాలం, కండరాల కీళ్ల నొప్పులు, తిమ్మిరికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే.. గాయాలు లేదా కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఈ రకమైన నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నొప్పి తగ్గాలంటే మాత్రం మీరు ఈ సీజన్ లో కూడా నీళ్లను పుష్కలంగా తాగాలి. బాగా శారీరక శ్రమ చేయాలని నిపుణులు చెబుతున్నారు.