ఈ అలవాట్లే గుండెపోటు వచ్చేలా చేస్తాయి

Published : Mar 27, 2023, 11:44 AM IST
ఈ అలవాట్లే గుండెపోటు వచ్చేలా చేస్తాయి

సారాంశం

స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. కానీ ఒకప్పుడు ఇలా లేదు. వయసు మీద పడ్డవారికి మాత్రమే గుండె జబ్బులు, గుండెపోటు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. కానీ ఇలా కావడానికి మన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  


గుండె కొట్టుకున్నంత సేపే మనం ప్రాణాలతో బతికేది. కానీ ఈ రోజుల్లో చాలా మంది గుండెలు చిన్న వయసులోనే ఆగుతున్నాయి. డ్యాన్స్ చేస్తూ.. గేమ్స్ ఆడుతూ, వర్కౌట్స్ చేస్తూ  ఇలా సడెన్ గా  కుప్పకూలుతున్నారు. దీనికి తోడు గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా మన జీవన  శైలే గుండె జబ్బులకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెపబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే జీవన శైలి అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సాధారణం కంటే ఎక్కువ బరువు

సాధారణం కంటే ఎక్కువ బరువున్నా గుండె పోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ బరువు మీ గుండెకు హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొడ్డు ప్రాంతం చుట్టూ అధిక బరువు ఉండటం గుండెకు అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనపు పౌండ్లను మోయడం, ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉన్న బరువు గుండెకు ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. అదనపు బరువు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి.  

తక్కువ శారీరక శ్రమ

గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ వ్యాయామాలు బరువును కూడా తగ్గిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురు పెద్దలలో ఒకరు, కౌమారదశలో 81% మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదు. 2020-2030 మధ్య గుండెపోటు, రక్తపోటు వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల సంఖ్య ఎలా పెరుగుతుందో కూడా ఈ నివేదిక చూపిస్తోంది. తక్కువ శారీరక శ్రమ, కదలకుండా ఒకేదగ్గర కూర్చోవడం వల్ల ధమనులలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు వస్తుంది. 

కాలేయం పట్ల అశ్రద్ధ 

కాలేయానికి గుండె ఆరోగ్యంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్స్ లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆల్కహాల్ వల్ల కాలేయంలో అసాధారణంగా కొవ్వు ఏర్పడుతుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. 2005 నుంచి 2018 వరకు జాతీయ ఆరోగ్య సర్వే డేటాను అధ్యయనం చేసిన పరిశోధకులు.. వృద్ధులు, పురుషులు లేదా డయాబెటిస్ లేదా కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నా,  నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారికి గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని కనుగొన్నారు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. సీజనల్ పండ్లు, కూరగాయలను, ప్రోటీన్లను, అసంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ కాలెయాన్ని సంరక్షిస్తాయి. 

మద్యం, పొగాకును అతిగా తీసుకోవడం

చాలా మందికి ఈ అలవాట్లు ఉంటాయి. ఆల్కహాల్, పొగాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల ఆల్కహాల్ ను తీసుకోవడం, సిగరెట్ ను కాల్చడం వల్ల కొన్ని రకాల హృదయ సంబంధ వ్యాధులు వస్తాయని 2006 పరిశోధన అధ్యయనం పేర్కొంది. అంతేకాదు అధిక రక్తపోటు, రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా స్ట్రోక్, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. 

ఉప్పును ఎక్కువగా తినడం

మన శరీరానికి ఉప్పు అవసరమే అయినప్పటికీ.. మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం లేని పోని రోగాలు వస్తాయి. మీరు వంటల్లో తక్కువ ఉప్పును వేసినా.. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీ శరీరంలో ఉప్పు కంటెంట్ ఎక్కువవుతుంది. ప్రతిరోజూ 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేస్తోంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉప్పును తీసుకోవడాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!