
ఎండాకాలం వచ్చేసింది. ఒకవేళ మీరు బరువు తగ్గాలని చూస్తుంటే.. ఈ సీజన్ బెస్ట్. ఎండలు ఎక్కువగా ఉండటం, వెచ్చగా ఉండటం, చెమటలు ఎక్కువగా పట్టడం, మెటబాలిజం రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఎండాకాలంలో బరువు తగ్గడం సులువు అవుతుంది. ఏదేమైనా అనారోగ్యకరమైన ఆహారాల జోలికి వెళ్లకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు తొందరగా బరువు తగ్గుతారు. ఎలాగంటే..
ద్రవాలను ఎక్కువగా తాగండి
వేడి వాతావరణంలో హైడ్రేట్ గా ఉండటానికి పుష్కలంగా నీటిని తాగుతూ ఉండాలి. అయితే మనలో చాలా మంది దాహం అయినా ఆకలిగానే భావిస్తారు. దాహం వేస్తే ఆకలి అవుతుందని ఏదోఒకటి తింటుంటారు. ఇదే మీరు ఎక్కువ బరువు పెరగడానికి దారితీస్తుంది. నీళ్లను తాగితే మనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినలేరు. అంతేకాదు వాటర్ మన జీవక్రియను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కేవలం నీళ్లే కాదు సత్తు, మజ్జిగ, లెమన్ వాటర్ వంటి హెల్తీ డ్రింక్స్ ను కూడా తాగండి. ఇవి కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకానీ.. శీతల పానీయాలు, సోడాలను అస్సలు తాగకండి. ఎందుకంటే ఇవి మీ బరువును పెంచుతాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కూడా.
పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఎండాకాలంలో ఇవి బరువు పెరగకుండా ఉండటానికి బాగా సహాయపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినడం వల్ల మీ కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆకలిని నియంత్రించడానికి, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది.
చురుగ్గా ఉండండి
చురుకుగా ఉండటానికి ఆరుబయట ఎక్కువ సేపు గడపండి. కేలరీలను బర్న్ చేయడానికి హైకింగ్, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ కార్యకలాపాలలో పాల్గొనండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ఈ ఆహారాలకు నో చెప్పండి
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే చిప్స్ లేదా మిఠాయి వంటి ఆహారాలను తినకండి. అంతేకాదు ఎండాకాలంలో గింజలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి వేడిని కలిగిస్తాయి. వేసవిలో సమస్యలను కలిగిస్తాయి. అందుకే గింజలను వేసవిలో ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా ఫైబర్ ఎక్కువగా ఉండే డాలియా, ఓట్స్, క్వినోవా వంటి తేలికపాటి ఆహారాలను తినండి. వీటితో పాటుగా మీ శరీరాన్ని తేలికగా, చల్లగా ఉంచడానికి మీ ఆహారంలో వివిధ రకాల సలాడ్లను కూడా చేర్చొచ్చు.