ఈ మందులు మీ గట్ ఆరోగ్యాన్నిదెబ్బతీస్తాయి జాగ్రత్త..

By Mahesh RajamoniFirst Published Mar 17, 2023, 11:55 AM IST
Highlights

కొన్ని రకాల మెడిసిన్స్ తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కానీ అవి మీ గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని రకాల మందులు గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. 
 

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ , పేలవమైన జీవనశైలి వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గ్యాస్, ఎసిడిటీ వంటి ఇతర సమస్యలు వస్తుంటాయి. దీనికి తోడు ప్రతి చిన్న సమస్యకు కూడా మందులు వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ కొన్ని రకాల మందులు గట్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వాటిని మీ సాధారణ జీవనశైలిలో భాగం చేసుకుంటే మీ మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియపై ప్రభావం  ఎక్కువగా ఉంటుంది. కొన్ని మందుల కూర్పు కడుపునకు అస్సలు మంచివి కావు. కాబ్టటి గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు గురిచేసే కొన్ని హానికరమైన మందుల గురించి తెలుసుకుందాం.

పెన్ కిల్లర్స్ (ఎన్ఎస్ఏఐడీలు)

ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, తలనొప్పితో పాటుగా ఎన్నో రకాల ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అలసట, శరీర నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సాధారణంగా ఈ మందులను తీసుకుంటారు. కానీ ఇది మన జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు. ఈ మందులు వాడటం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ మందులు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే ప్రోస్టాగ్లాండిన్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను రక్షించడానికి ప్రోస్టాగ్లాండిన్స్ అవసరం. అయితే జీర్ణవ్యవస్థ రక్షిత పొర దెబ్బతిన్నప్పుడు ఆమ్లాలు సులభంగా కణాలలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల ఇన్ఫ్లమేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంది. 

స్టెరాయిడ్స్ 

స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.  డ్రగ్ దుర్వినియోగంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. స్టెరాయిడ్లు కాలేయం దెబ్బతినడానికి కారణమవుతాయి. వీటిని మితిమీరి వాడితే కణితి, ప్లియోసిస్ హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. దీనివల్ల కాలేయంలో రక్తంతో నిండిన తిత్తులు ఏర్పడతాయి. దీనివల్ల అంతర్గత రక్తస్రావం ప్రారంభమవుతుంది. దీనితో పాటు  ఇది కడుపు పొరను దెబ్బతీస్తుంది. తర్వాత కడుపులో పుండ్లుగా మారుతుంది. ఎసిడిటీ, పొత్తికడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

యాంటీబయాటిక్స్

యాంటీబయాటిక్స్ కడుపునకు అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇది మీ కడుపు పొరను చికాకుపెడుతుంది. దీంతో కడుపు గ్రంథిలో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, వాంతులు, వికారం, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. 

యాంటీ-యాంగ్జైటీ డ్రగ్స్

ప్రస్తుతం చాలా మంది ఆందోళన, డిప్రెషన్ కు బలైపోతున్నారు. దీని నుంచి బయటపడేందుకు వివిధ రకాల యాంటీ-యాంగ్జైటీ మందులను తీసుకుంటున్నారు. కానీ ఇవి అంత మంచివి కావు. ఎందుకంటే  వీటిని తీసుకోవడం వల్ల వికారం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అంతే కాదు కడుపు పై భాగంలో నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే మీ జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు. 

click me!