
డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి జీవన నాణ్యతను చాలా వరకు తగ్గిస్తుంది. డయాబెటీస్ రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్ రెండు టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ జన్యుపరంగా వస్తుంది. దీన్ని ఏం చేసినా ఆపలేం. ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి. దీనిలో ప్యాంక్రియాస్ తక్కువ లేదా ఇన్సులిన్ తయారుచేయదు. ఇకపోతే టైప్ 2 డయాబెటీస్ ను జీవన శైలి వ్యాధిగా చెప్తారు. దీనిని నివారించొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని జీవన శైలి అలవాట్లను అనుసరించడమే. డయాబెటీస్ బారిన పడకూడదంటే ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెర, శుద్ధి చేసిన కార్బ్ ను తగ్గించాలి
చక్కెర, శుద్ధి చేసిన కార్భోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది కాలక్రమేణా మిమ్మల్ని డయాబెటీస్ బారిన పడేస్తుంది. ఈ దీర్ఘకాలికి వ్యాధి ప్రమాదాన్ని తగ్గించాలనుకుంటే చక్కెర, శుద్ధి చేసిన కార్భోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించండి. అనారోగ్యకరమైన పిండి పదార్థాలు వైట్ బ్రెడ్, పాస్తా, బంగాళాదుంపలు, మైదా పిండి వంటి వాటిని తగ్గించండి.
ఫైబర్ ను ఎక్కువగా తీసుకోండి
ఫైబర్ రిచ్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కరిగే ఫైబర్, రెండు కరగని ఫైబర్. కరిగే ఫైబర్ నీటిని గ్రహిస్తుంది. కరగని ఫైబర్ నీటిని గ్రహించలేదు. ఇది నీటిలో కరిగిపోలేదు. నీటిలో కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వీటిని నియంత్రిస్తుంది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఫైబర్ ఆపిల్, అరటిపండ్లు, ఓట్స్, బ్లాక్ బీన్స్, లిమా బీన్స్, బ్రస్సెల్స్ మొలకలు, అవొకాడో వంటి ఆహారాల్లో కూడా ఉంటుంది.
శారీరకంగా చురుగ్గా ఉండాలి
వ్యాయామం మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడమే కాదు ఎన్నో దీర్ఘకాలిక రోగాల ప్రమాదం కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే డయాబెటీస్ వ్యాధి ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం మీరు చెమటలు కక్కే హార్డ్ వ్యాయామాలను చేయాల్సిన అవసరం లేదు. ట్రెడ్ మీల్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటివి చేసినా సరిపోతుంది. కదలకుండా ఉండే అలవాటును మానుకోండి. ఇంటి పనులను చేయండి.
చక్కెర పానీయాలకంటే నీరే మంచిది
మన ఆరోగ్యానికి నీళ్లు చేసే మేలు మరే ఇతర పానీయాలు చేయలేవు. డయాబెటీస్ కు దూరంగా ఉండాలన్నా.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను చాలా వరకు తగ్గించాలి. నీటిని పుష్కలంగా తాగాలి. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.