
అసలు మన రోజు ఎలా గడుస్తుంది? ఉదయం ఏం పనులు చేస్తున్నాం.. ఏం తింటున్నాం.. రోజు ఎలా గడిచిపోతుంది అనే వాటిమీదే మన మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నామో.. అదే మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉదయం మనం చేసే కొన్ని తప్పులు బరువు పెరిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
అతిగా నిద్రపోవడం
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోతే చాలన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఇంతకంటే ఎక్కువ నిద్రపోవడమో.. లేకపోతే తక్కువగా నిద్రపోవడమో చేస్తుంటారు. కానీ ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మీరు వేగంగా బరువు పెరిగేలా చేస్తాయి. మీరు లేట్ గా పడుకుని ఉదయం లేట్ గా నిద్రలేవడం వల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను తినలేరు. దీనివల్ల మీ జీవక్రియపై చెడు ప్రభావం పడుతుంది. రోజుకు 9 నుంచి 10 గంటలు నిద్రపోయే వారు ఊబకాయం బారిన పడే అవకాశం 21 శాతం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
పొద్దున్నే నీళ్లను తాగకపోవడం
లేచిన వెంటనే ఒకటి రెండు గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. కానీ కొంతమంది బ్రష్ చేయనిదే అస్సలు తాగరు. ఇంకొందరు నీళ్లకంటే ముందు టీ, కాఫీలనే తాగుతుంటారు. కానీ నీళ్లను తాగకపోవడం వల్ల నడుముపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు మన శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. మనల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అందుకే ఉదయం లేవగానే నీటిని ఖచ్చితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్
రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ లో ఏవి పడితే అవి తినకూడదు. ఉదయం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలనే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. కానీ చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసే వాటినే తింటుంటారు. అంటే కొవ్వు, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తింటుంటారు. ఉదయం పూట ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి గ్యాస్ సమస్యకు దారితీస్తాయి.
తినేటప్పుడు టీవీ చూడడం
చాలా మంది లేవగానే టీవీని చూస్తారు. టీవీని చూస్తూనే తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే టీవీని చూస్తూ తింటే మీరు ఎంత తింటున్నారో తెలియదు. దీనివల్ల ఎక్కువగా తినే అవకాశం ఉంది. దీనికి తోడు ఫుడ్ ను అస్సలు నమలరు. వీటన్నింటి వల్ల మీరు వేగంగా బరువు పెరుగుతారు.
కాఫీ
పాలు, పంచదార కలిపిన టీ, కాఫీలు మీరు వేగంగా బరువు పెరగడానికి దారితీస్తాయి. బరువు తగ్గాలనుకుంటే కాఫీ, టీ లలో పాలు, పంచదారను వాడకండి. వీటికి బదులుగా షుగర్ ఫ్రీ సోయా మిల్క్, బాదం పాలు, ఓట్స్ మిల్క్ ను తాగండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వర్కౌట్స్ చేయకపోవడం
ఉదయం పరిగడుపున వర్కౌట్స్ చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఫాస్ట్ గా కరిగిపోతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్నే వ్యాయామం చేయండి. వాకింగ్, జాగింగ్ లాంటివి చేసినా మంచి ఫలితం ఉంటుంది.