
మనుషులకు నిద్ర అవసరం కాదు అత్యవసరం. అవును నిద్రతోనే మన శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది. శరీర అవయవాలను రిపేర్ చేస్తుంది. కంటినిండా నిద్రలేకపోతే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. కంటినిండా నిద్రపోతే గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. నిద్ర ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి.
రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే పగటి పూట నిద్రపోతారు. పగటిపూట నిద్ర అలవాటైతే మీకు రాత్రిళ్లు ఏం చేసినా నిద్ర రాదు. పగటి పూట నిద్ర జీవక్రియను తగ్గిస్తుంది. ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. మీకు తెలుసా కంటినిండా నిద్రపోకపోతే అలసట, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడటం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు రాత్రిళ్లు హాయిగా పడుకుంటారు. అవేంటంటే..
మంచి నిద్రకు సహాయపడే కొన్ని ఆహారాలు
రెగ్యులర్ గా పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలను తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే పాలు బాగా నిద్రపట్టడానికి సహాయపడతాయి. అలాగే అరటిపండ్లు, కివి, గుమ్మడికాయ విత్తనాలు, బాదం, ఓట్స్, తేనె వంటి ఆహారాలు కూడా మీరు రాత్రి హాయగా పడుకోవడానికి సహాయపడతాయి.