డెంగ్యూపై బ్రహ్మాస్త్రం : భారత్ నుంచి తొలి వ్యాక్సిన్, 2026లో అందుబాటులోకి.. మన హైదరాబాద్‌ కంపెనీయే

By Siva Kodati  |  First Published Aug 24, 2023, 3:03 PM IST

దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) అభివృద్ధి చేసిన డెంగ్యూ ఫీవర్ వ్యాక్సిన్‌ను 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకురానుంది.


ప్రపంచానికి వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిన భారత్ నుంచి మరో వ్యాక్సిన్ రానుంది. దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) అభివృద్ధి చేసిన డెంగ్యూ ఫీవర్ వ్యాక్సిన్‌ను 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇది భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి గడిచిన కొన్నేళ్లుగా దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య దేశంలో 31,464 డెంగ్యూ కేసులు, 36 మరణాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ సమయంలో డెంగ్యూ వ్యాప్తి పడిపోయినప్పటికీ 2020 నుంచి 2021 వరకు 333 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే 2021 నుంచి 2022 మధ్య డెంగ్యూ కేసుల సంఖ్య 21 శాతం పెరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ తెలిపింది. 

ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తయారీలో భాగంగా 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల 90 మంది వ్యక్తులపై నిర్వహించిన ప్రారంభ దశ ట్రయల్స్‌లో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు నమోదు కాలేదని తెలిపారు. తొలి దశ ట్రయల్స్‌ను పూర్తి చేసి త్వరలో రెండో దశలోకి వెళ్తామని ఆనంద్ చెప్పారు. వీటన్నింటికీ కనీసం రెండు మూడేళ్ల సమయం పడుతుందని, అందువల్ల 2026 జనవరి నాటికి వ్యాక్సిన్ కమర్షియల్ లాంచ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

Latest Videos

అమెరికా కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) డెంగ్యూపై టీకాను అభివృద్ధి చేయడానికి అవసరమైన సాయాన్ని ఐఐఎల్‌కి అందించిందని ఆనంద్ తెలిపారు. ఐఐఎల్‌‌తో పాటు మరో రెండు భారతీయ కంపెనీల సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పనేసియా బయోటెక్‌లు డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని 50కి పైగా దేశాల్లోని జంతువులకు, మనుషులకు అవసరమైన వ్యాక్సిన్‌లను ఎగుమతి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐఐఎల్.. రేబిస్ వ్యాక్సిన్‌ తయారీలో అగ్రగామిగా వుంది. దేశంలో దీని అమ్మకాలు 35 శాతం పైనే వున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 13 బిలియన్ రూపాయాల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. 

click me!