నోటి నుంచి దుర్వాసన రాకూడదంటే ఇలా చేయండి

Published : May 09, 2023, 01:43 PM IST
నోటి నుంచి దుర్వాసన రాకూడదంటే ఇలా చేయండి

సారాంశం

నోటి నుంచి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలున్నాయి. శరీరానికి సరిపడా నీరు లేకపోవడం డీహైడ్రేషన్, ఎక్కువ సేపు మాట్లాడకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.  

చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఉదయాన్నే బ్రష్ చేసుకుని మౌత్ వాష్ వాడినా కూడా నోటి నుంచి దుర్వాసన అలాగే వస్తుందని చాలా మంది వాపోతుంటారు. ఈ నోటి దుర్వాసన వల్ల ఇతరులతో దగ్గర మాట్లాడటానికి, నలుగురిలోకి వెళ్లడానికి కూడా నామోషీగా ఫీలవుతారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, దంతాల వ్యాధి, చిగుళ్ల వాపు వంటి కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. 

నోటి దుర్వాసనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్, చురుకుదనం లోపించడం వంటివి నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు. భోజనం చేసిన తర్వాత సరైన సమయంలో నోటిని శుభ్రం చేసుకోకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే నోటిని లేదా శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేసే వివిధ వ్యాధుల వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే ధూమపానం, మద్యపానం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. నోటి నుంచి దుర్వాసన పోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 
దంతాల పరిశుభ్రత: నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి దంత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజుకు రెండుసార్లు బాగా బ్రష్ చేయాలి. చాలా మంది రాత్రిపూట పళ్లు తోముకోవడానికి ఇష్టపడరు. రాత్రిపూట తిన్న ఆహారం అవశేషాలను తొలగించకపోతే అవి దంతాల మధ్య అంటుకుంటాయి. దీనివల్ల నోటి నుంచి ఘాటైన వాసన వస్తుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడానికి ప్రయత్నించండి. దీని కోసం ఏదైనా ఆయుర్వేద పేస్ట్ ను ఉపయోగించండి. 

మౌత్ వాష్: డాక్టర్ సిపారసు చేస్తే.. భోజనం చేసిన తర్వాత నోటిని శుభ్రం చేయడానికి మౌత్ వాష్ ఉపయోగించండి. 

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఏదైనా ఆహారంతో పాటుగా పండ్లు తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

వాటర్:  పుష్కలంగా నీటిని తాగండి. నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువవుతుంది. 

ఎసిడిటీ: ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ తో బాధపడుతున్నారు. ఛాతీ దిగువ భాగంలో కలిగే గుండెల్లో మంట అసిడిటీకి సంకేతం. యాసిడ్ రిఫ్లక్స్ కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. 

చిగుళ్ల వ్యాధి:  మీకు చిగుళ్ల వ్యాధి, చిగుళ్ల వాపు, ఇతర దంత వ్యాధులు ఉంటే వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇవి కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి.

సోంపు గింజలు:  నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి సోంపు గింజలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను తినడం అలవాటు చేసుకోండి.

యాలకులు: భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు యాలకులను నోట్లో వేసుకుని నమలండి. ఎందుకంటే యాలకులు కూడా నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి సహాయపడతాయి.

లవంగాలు: తిన్న తర్వాత లవంగాలను నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన రావడం తగ్గుతుంది. లవంగాలలో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి.

గ్రీన్ టీ: రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. అలాగే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!