
అన్నవాహిక క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్లలో 8 వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్త క్యాన్సర్ మరణాలకు 6 వ ప్రధాన కారణం ఈ క్యాన్సర్. అన్నవాహిక క్యాన్సర్ అన్నవాహికలో అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్యానికి ఇది ఒక సాధారణ కారణం. జీర్ణక్రియ కోసం స్వరపేటిక నుంచి కడుపునకు ఆహారాన్ని తరలించడానికి అన్నవాహిక సహాయపడుతుంది. అన్నవాహిక క్యాన్సర్ ఆడవారి కంటే మగవారికే ఎక్కువగా వస్తుంది.
పొగాకు వాడకం, మందును తాగడం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్, యాసిడ్ రిఫ్లక్స్ ఈ క్యాన్సర్ కు దారితీసే కారకాలు. క్యాన్సర్ అన్నవాహిక ఏ భాగంలోనైనా అభివృద్ధి చెందుతుంది. ఇది ఎన్నో లక్షణాలను కలిగిస్తుంది. అయినప్పటికీ ఈ క్యాన్సర్ కొన్ని సాధారణ సంకేతాలు ఇలా ఉంటాయి..
మింగలేకపోవడం: అన్నవాహిక క్యాన్సర్ వల్ల ఎలాంటి ఆహారాన్నైనా మింగలేకపోతారు. ఎందుకంటే అన్నవాహిక ల్యూమెన్ సంకుచితంగా మారుతుంది. ప్రారంభంలో గట్టి ఆహారాలను మాత్రమే మింగడానికి రాదు. కానీ ఈ వ్యాధి పెరుగుతున్న కొద్దీ ద్రవాలను మింగడానికి కూడా ఇబ్బంది పడతారు.
ఆహారాన్ని మింగేటప్పుడు నొప్పి: మీరు ఏదైనా తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. మింగేటప్పుడు నొప్పి కలుగుతుంది. అన్నవాహిక క్యాన్సర్ వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుుకే జాగ్రత్తగా ఉండండి. గొంతులో పుండ్లు ఉన్నప్పుడు ఫుడ్ ను మింగలేరు. దీన్నే ఒడినోఫాగియా అంటారు.
ఛాతీ నొప్పి: అన్నవాహిక క్యాన్సర్ సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి ఒకటి. ఈ నొప్పి ఛాతీలో లేదా వెనుక భాగంలో ఉండొచ్చు.
దగ్గు: అన్నవాహిక క్యాన్యర్ నిరంతర దగ్గుకు దారితీస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
వాంతులు: వాంతులు, ఎముకల నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇవి కూడా అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలే.
అలసట: ఈ క్యాన్సర్ ఉంటే ఒక వ్యక్తి ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటారు. దీనివల్ల తమ రోజు వారి పనులను చేసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది.
గుండెల్లో మంట: అన్నవాహిక క్యాన్సర్ ఉన్న వారికి కూడా గుండెల్లో మంట సమస్య వస్తుంది.
దగ్గు లో రక్తం: దగ్గుతున్నప్పుడు రక్తం పడితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది అన్నవాహిక క్యాన్సర్ సంకేతం కాబట్టి.