
ముత్యాల తెల్లని దంతాలు అందరికీ ఇష్టమే. అలా అని నాలుకను కూడా తెల్లగా ఉంచుకుంటామంటే కుదరదు. ఆరోగ్యకరమైన నాలుక లేత గులాబీ రంగులోనే ఉండాలి. అలాగే ఉపరితలంపై కొంత తెలుపు ఉండాలి. కానీ పూర్తిగా తెలుపు లేదా పసుపు రంగులో అసలే ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎన్నో నోటి సమస్యలను కలిగిస్తుంది. నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోవడం, సంరక్షణ సరిగ్గా లేకపోవడం, ధూమపానం, జన్యుపరంగా, కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలను తీసుకోవడంతో పాటుగా ఇంకొన్ని కారణాల వల్ల నాలుక తెలుపు లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. హాస్పటల్ కు వెళ్లి లేదా కొన్ని ఇంటి చిట్కాలతో నాలుకపై ఉన్న తెలుపుదనాన్ని వదిలించుకోవచ్చు.
నాలుకపై తెలుపును వదిలించుకోవడం ఎలా?
ఆహార కణాలు, సూక్ష్మక్రిములు, చనిపోయిన కణాల కారణంగా నాలుకపై తెల్లని పూత ఏర్పడుతుంది. దీనివల్ల అసౌకర్యం, దుర్వాసన, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. నాలుక తెల్లగా ఉండటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు రానప్పటికీ.. ఇది దంత పరిశుభ్రత సరిగ్గా లేదని సూచిస్తుంది. చివరికి ఇది సంక్రమణకు దారితీస్తుంది. అందుకే నాలుకపై తెలుపుదనాన్ని వదిలించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
ఉప్పునీటితో పుక్కిలించండి.
ఉప్పు నీరు నాలుకపై తెలుపుదనాన్ని వదిలించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలపండి. ఈ నీటిని నోట్లో పోసుకుని సుమారు 30 సెకన్ల పాటు అటూ ఇటూ అనండి. ఉప్పులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ నోట్లోని బ్యాక్టీరియాను చంపడానికి, మీ నాలుకపై తెలుపు ఏర్పడటాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
టంగ్ స్క్రాపర్
నాలుకపై ఉన్న తెల్లని పూతను తొలగించడానికి మరొక సులువైన, ప్రభావవంతమైన పద్ధతి నాలుక స్క్రాపర్ ను ఉపయోగించడం. మెడికల్ షాపుల్లో టంగ్ స్క్రాపర్లు లభిస్తాయి. ఇవి మీ నాలుకపై ఉన్న బ్యాక్టీరియా, శిథిలాల పొరను సున్నితంగా తొలగించడానికి సహాయపడతాయి. దీన్ని మీ నాలుకపై ఉంచి నెమ్మదిగా ముందుకు లాగండి. అయితే ఇలా లాగిన ప్రతి సారి కడగండి. ఆ తర్వాతే ఉపయోగించండి.
ప్రోబయోటిక్స్
పెరుగు వంటి ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తింటే కూడా మీ నోట్లోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. ప్రోబయోటిక్స్ హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడానికి, మీ నాలుకపై తెల్లని పూత ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి.
ఆయిల్ పుల్లింగ్
ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన పద్ధతి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసి 15 నుంచి 20 నిమిషాల పాటు మీ నోట్లో ఉంచండి. అలాగే దాన్ని అటూ ఇటూ కదపండి. నూనె సహజ క్లెన్సర్ గా పనిచేస్తుంది. అలాగే మీ నోట్లో నుంచి బ్యాక్టీరియా, శిధిలాలను తొలగిస్తుంది. అలాగే నాలుకపై తెల్ల పూత ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా మీ నోట్లోని ఆమ్లాలను తటస్తం చేయడానికి, నాలుకపై బ్యాక్టీరియా ఏర్పడటాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీని పేస్ట్ ను తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని అందులోకి కొన్ని నీళ్లను పోసి పేస్ట్ లా చేయండి. మీ నాలుకను క్లీన్ చేయడానికి దీన్ని ఉపయోగించండి. వృత్తాకార కదలికలో సున్నితంగా బ్రష్ చేయండి. తెల్లగా ఉండే ప్లేస్ ను మరింత ఎక్కువగా క్లీన్ చేయండి.