
చాలా మంది ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీని పక్కాగా తాగుతారు. ఇది మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీలను కాకుండా నీళ్లను తాగడం మంచి అలవాటని.. బ్రేక్ ఫాస్ట్ తర్వాతే టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఉదయం ఒక్కపూటే కాదు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటూ తేడా లేకుండా అలసటగా అనిపించిన ప్రతిసారి తాగుతంటారు. కానీ టీ లేదా కాఫీలను తాగడం వల్ల తాత్కాలికంగా మాత్రమే రిఫ్రెష్ గా ఉంటుంది. ఇది తర్వాత అలసటను మరింత పెంచుతుంది.
ముఖ్యంగా ఎండాకాలంలో వేడి వాతావరణంలో అలసటగా అనిపిస్తే టీ, కాఫీలు తీసుకోకపోవడమే మంచిది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. దీనికి సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది. క్రమం తప్పకుండా అలసటను ఎదుర్కొంటుంటే ముందు దానికి కారణాలేంటో తెలుసుకోండి. హెల్త్ చెకప్ లు చేయించుకోండి. మీ శరీరంలో పోషక లోపాలు ఉంటే కూడా తరచుగా అలసిపోతుంటారు. అయితే కొన్ని పానీయాలు మీ అలసటను దూరం చేయడానికి సహాయపడతాయి. ఇవి మీకు త్వరగా శక్తినిస్తాయి. అవేంటంటే..
పెరుగు, పండ్లు
పండ్లు, పెరుగును కలిపి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో పండ్లను బీట్ చేసి లస్సీగా తీసుకోవడం కూడా మంచిదే. అందులో కొద్దిగా బాదం, డ్రై ఫ్రూట్స్ ను కలపండి. టేస్టీగా ఉంటుంది. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది.
హెర్బల్ టీలు
ఇంట్లో తయారుచేసే హెర్బల్ టీలు కూడా ఈ రకమైన అలసట నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. ఇంట్లో తయారుచేసుకోగలిగే హెర్బల్ టీల జాబితాలో గ్రీన్ టీ, యాలకులతో గ్రీన్ టీ, తేనె కలిపిన గ్రీన్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాలుగా ఉన్నాయి.
దానిమ్మ జ్యూస్
దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ మూడ్ బాగుంటుంది. ఈ జ్యూస్ మీకు తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. దానిమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దానిమ్మలో విటమిన్ సి, విటమిన్-కె, విటమిన్-ఇ, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి.
పుచ్చకాయ జ్యూస్
పుచ్చకాయ జ్యూస్ కూడా మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో.. దీనికి చియా విత్తనాలను జోడించి తాగొచ్చు. విటమిన్ -సి, ఐరన్ పుష్కలంగా ఉండే పుచ్చకాయలు శరీరాన్ని చల్లబరిచి శక్తిని పెంచుతాయి.