
మారిన జీవన శైలి, బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి వంటివి సమస్యలుగా కనిపించకపోవచ్చు. కానీ ఇవే మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తాయి. రెస్ట్ లెస్ గా పనిచేయడం వల్ల మీరు ఊహించలేని రోగాల బారిన పడతారు. దీనికి తోడు చాలా మంది కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని పని చేస్తారు. డెస్క్ వద్ద ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మీ మెడ, తల, భుజాల్లో నొప్పి కలుగుతుంది. కానీ శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం, ఒత్తిడితో ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల మెడనొప్పి, మైగ్రేన్, తలనొప్పితో పాటుగా ఇతర శారీరక, మానసిక సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ హెడ్ మసాజ్ చేసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా హెడ్ మసాజ్ తో ఒత్తిడి, ఆందోళనలు ఇట్టే తగ్గిపోతాయి. హెడ్ మసాజ్ మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అసలు హెడ్ మసాజ్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి నుంచి ఉపశమనం
హెడ్ మసాజ్ లో మెడ, తల, భుజాల కండరాలను సడలించడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. అలాగే కండరాల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి.
తలనొప్పి, మైగ్రేన్ నొప్పి మాయం
హెడ్ మసాజ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మైగ్రేన్, తలనొప్పిని తగ్గించడానికి కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. హెడ్ మసాజ్ మన శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. స్ట్రెస్ ను తగ్గిస్తుంది.
జుట్టు పెరిగేందుకు
తలమీద మసాజ్ చేయడం వల్ల నెత్తిమీద రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఊడటం ఆగుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే నెత్తిమీద చనిపోయిన కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అయితే హెడ్ మసాజ్ ఈ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. హెడ్ మసాజ్ తర్వాత మీ ఒత్తిడంతా పోయి.. గాఢంగా నిద్రపోతారు. ఇది మిమ్మల్ని రిలాక్స్డ్ మోడ్ లో ఉంచుతుంది. ఇది మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.