మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం చేయడంతో సదరు యువకుడి పాంక్రియాస్ (క్లోమం) పూర్తిగా పాడైపోయింది.
యువత చిన్న వయసులోనే సరదాలు, చెడు అలవాట్లకు దగ్గరవుతోంది. కనీసం 20 ఏళ్లయినా రాకముందే పొగ తాగడం, మందు కొట్టడం అలవాటు చేసుకుంటున్నారు. సరదాగా మొదలైన ఈ అలవాట్లు వ్యసనాలకు మారుతున్నాయి. చివరికి ప్రాణాలను హరిస్తున్నాయి. ఇలా చిన్న వయసులోనే మద్యానికి బానిసలైనవారు చేతికందే సమయానికి మృత్యువు పాలవుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. కొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తమతో పాటు కుటుంబ సభ్యులను బాధిస్తున్నారు.
ఇలాంటి స్టోరీ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే, మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్న యువకుడిని డాక్టర్లు కాపాడారు. పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం చేయడంతో సదరు యువకుడి పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరింది. దీంతో అతనికి ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో ఆపరేషన్ చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవని బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు తేల్చేశారు. కొందరైతే అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఈ కేసు వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ వెల్లడించారు.
undefined
“హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్ టెన్త్ చదివే సమయంలో మద్యపానం అలవాటు చేసుకున్నాడు. తరచూ ఆల్కహాల్ తాగడంతో అతని పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి ఒక గోడలా తయారైంది. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అయితే, లోకేష్ బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో అనంతపురంలోనే మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. దాంతో రోగి, అతని బంధువులు బెంగళూరు వెళ్లారు. అక్కడ మూడు నాలుగు ఆస్పత్రులు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవని... ఒకవేళ చేసినా, 60- 70% మంది చనిపోతారని.... బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రుల్లో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగింది. రక్తపోటు పడిపోయింది.’’ ఈ క్రమంలో క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించాలని వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ పేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశారు. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెడతామని వైద్యులు మహ్మద్ షాహిద్ తెలిపారు.
ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడని, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతనికి కచ్చితంగా మధుమేహం (షుగర్) వస్తుందని తెలిపారు. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలని తేల్చిచెప్పారు. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలని వివరించారు.