
డయాబెటిస్ ఈ రోజుల్లో ఒక సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. డయాబెటిస్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు దేశంలో దీని బారిన పడేవారి సంఖ్య బాగా పెరుగుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఇది ఒక జీవనశైలి వ్యాధి. కాబట్టి మన జీవనశైలిని మెరుగుపరచుకుంటే మధుమేహాన్ని కొంతవరకు నివారించొచ్చు. ముఖ్యంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను అసలే తినకూడదు. ఇంకొన్నింటిని తప్పకుండా తినాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు నీళ్లను ఎక్కువగా తాగాలని చెప్తుంటారు డాక్టర్లు. ఇలా ఎందుకు చెబుతున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా?
డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు గ్లూకోజ్ శరీరం నుంచి మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. మూత్రం ద్వారా గ్లూకోజ్ ను సరిగ్గా బయటకు పంపడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచడానికి నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
ముఖ్యంగా డయాబెటిస్ తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యను నివారించడానికి ఎప్పుడూ నీటిని పుష్కలంగా తాగాలి. డయాబెటిస్ రోగులు డీహైడ్రేషన్ బారన పడినా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలని డాక్టర్లు చెబుతారు.
అయితే మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాతే నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనం తర్వాతే కాదు భోజనానికి ముందు కూడా నీళ్లను తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. పండ్లలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే తీపి ఎక్కువగా ఉండే పండ్లను తినకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇలాంటి పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.
నీళ్లను తాగడానికి భయపడేవారు, మతిమరుపు సమస్య ఉన్నవారు అలారంను సెట్ చేసుకోవాలి. లేదా ఎప్పుడూ చేతిలో బాటిల్ ను ఉంచుకోవాలి. అలాగే మీరు మసాలా దినుసులు లేదా మూలికలతో మరిగించిన నీటిని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఇవి కూడా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.