
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి ముందస్తు లక్షణాలను చూపించకుండా సమస్యను పెద్దది చేసి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది. ఈ సమస్య ఎక్కువగా వృద్దులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ ఇప్పుడు చిన్న వయసు వారు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. రక్తపోటు 130/80 మిమీ హెచ్జి లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని అధిక రక్తపోటు అంటారు.
అధిక రక్తపోటు గుండె పోటుకు దారితీస్తుంది. మరెన్నో సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఈ సమస్యను మొదట్లోనే గుర్తించాలి. బీపీ పేషెంట్లు రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. తగ్గించుకునే చిట్కాలను ఫాలో అవ్వాలి. తప్పుడు ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. పెద్దవారికి ఈ అధిక రక్తపోటు సమస్య రావడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం
అధిక రక్తపోటుకు ప్రధాన కారణాల్లో ఊబకాయం ఒకటి. బెల్లీ ఫ్యాట్ డయాబెటిస్, గుండె జబ్బులు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి.
సోడియం
ఎక్కువ సోడియం శరీరం ద్రవాన్ని నిలుపుకోవటానికి కారణమవుతుంది. ఇది మీ శరీరంలోని ధమనులు సంకోచించడానికి కూడా కారణమవుతుంది. సోడియాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ కు దారితీస్తుంది.
స్మోకింగ్
ధూమపానం అధిక రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుదలకు కారణమవుతుంది. ఇది ప్రాణాంతక రక్తపోటుతో ముడిపడి ఉందని కనుగొన్నారు. నికోటిన్ అడ్రినెర్జిక్ అగోనిస్ట్ గా పనిచేస్తుంది. నికోటిన్ ను ఏ రూపంలోనైనా ఉపయోగించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని 2010 లో ఒక సర్జన్ జనరల్ నివేదిక సూచించింది.
ఒత్తిడి
అధిక ఒత్తిడి స్థాయిలు కూడా రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి రక్తపోటును పెంచడంతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటీస్
డయాబెటిస్ ఉన్నవారికి ఇతరులకన్నా అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. డయాబెటిస్ చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది రక్త నాళాల గోడలను గట్టిపరుస్తుంది. ఈ మార్పులన్నీ అధిక రక్తపోటుకు కారణమవుతాయి.