
కంటి ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలున్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.మన కళ్లు సమర్థవంతంగా పనిచేయడానికి, వృద్ధాప్య సంబంధిత రుగ్మతలను నివారించడానికి, దృష్టి నష్టాన్ని నివారించడానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా ఇతర పోషకాలున్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ సమస్యలను వైద్యంతో తగ్గించుకోవచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం రికవరీ రేటును మెరుగుపరుస్తుంది. శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే కళ్లకు సరైన పోషణ అవసరం. కొన్ని ఆహారాలు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ కంటిచూపు బాగా కనిపిస్తుంది.
సమతుల్య ఆహారంలో ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ఉండాలి. రోజూ రెయిన్ బో ఫుడ్ ను తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. ప్రాసెస్ చేసిన, చక్కెర ఎక్కువగా ఉన్న లేదా సంతృప్తమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాలను తినాలంటే..
విటమిన్ ఎ
కొత్తిమీర రసం, క్యారెట్ రసం, మెంతి, బచ్చలికూర, గుడ్డు పచ్చసొనలు, మటన్ కాలేయం, ఎక్కువ ఎరుపు, పసుపు రంగు పండ్లు, చిలగడదుంపలు, మామిడి, బొప్పాయి, గుమ్మడికాయ, జున్ను, పీచెస్, చెర్రీలు, పాలు, క్రీమ్, పాలకూర, పుచ్చకాయ మొదలైనవి వాటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ కంటి సమస్యలను పోగొడుతాయి. అలాగే కళ్లు బాగా కనిపించడానికి సహాయపడతాయి.
రిబోఫ్లేవిన్
బాదం, అల్ఫాల్ఫా మొలకలు, గోధుమ గింజలు, సోయాబీన్, పనీర్, నువ్వులు, పప్పుధాన్యాలు, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారాల్లో రిబోఫ్లేవిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
కాల్షియం
నువ్వులు, సీఫుడ్, జున్ను, పాలు, పెరుగు, బ్రూవర్ ఈస్ట్, కాబూలీ శన్నా, రాజ్మా, సోయా బీన్స్, బాదం, గోధుమ గింజలు, గుడ్లు, వాల్నట్స్, జొన్నలు, బజ్రీ, నాచిని, ఓట్స్, బ్లాక్స్ట్రాప్ మొలాసిస్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ ఇ
బాదం, వాల్ నట్స్, వేరుశెనగ, గోధుమ గింజలు, జీడిపప్పు, బచ్చలికూర, ఆస్పరాగస్ వంటి ఆకుకూరలు, గోధుమ, నువ్వులు విటమిన్ ఇ కి మంచి వనరులు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు
కాడ్ లివర్ ఆయిల్లో ఉండే ఒమేగా -3 కొవ్వులు కంటి చూపును మెరుగుపరచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడతాయి.