పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైసిపి ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోరాటం చేయాలని ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారని వైసీపీ పార్లమెంటరి పార్టీ నేత మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న పోలవరం నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించినట్లు వెల్లడించారు.
మరికొద్దిరోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఈ నేపథ్యంలో వైసిపి పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్రం ముందుంచాలని జగన్ ఆదేశించినట్లు ఎంపీలకు జగన్ సూచించారు.
ఈ సమావేశం అనంతరం మిధున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామాయపట్నం పోర్టు, మెడికల్ కాలేజీలు, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజిపై పార్లమెంట్ లో స్తావించబోతున్నామని తెలిపారు.
read more వైఎస్‌ఆర్ ది ఫ్యాక్షనిజం... జగన్ ది మాత్రం సైకోయిజం...: నారా లోకేశ్
విభజన హామీల అమలుకు పార్లమెంట్ వేదికగా ఒత్తిడి తెస్తామన్నారు. కాగ్ రిపోర్ట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. కేంద్రంపై పార్లమెంట్ వేదికగా ఒత్తిడి తెస్తామని...హోదా, విభజన హామీల అమలు మొదట ప్రాధాన్యతగా పోరాటం చేయాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు. కామన్ సివిల్ కోడ్ పై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మిథున్ రెడ్డి తెలిపారు.
అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ...రాష్ట్రంలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. నిధుల లేమితో జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయని... అందువల్ల కేంద్ర విద్యా సంస్థలకు నిధులు ఇవ్వాలని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించబోతున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా జగన్ ఎంపీల సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతున్నా, పథకాల అమల్లో వివక్షతకు తావులేకుండా పారదర్శక పాలన జరుగుతున్నా ప్రతిపక్ష టీడీపీ నిరంతరం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని బలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.
read more 70 ఏళ్ల బండి లోకేశ్ స్పీడ్ బ్రేకర్‌ను దాటలేదు: బాబుపై వంశీ తీవ్రవ్యాఖ్యలు
లోకసభ సభ్యుల సంఖ్యా బలం చూసుకుంటే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ అని, వచ్చే రోజుల్లో మరిన్ని రాజ్యసభ సీట్లు పార్టీకి వస్తాయని, పార్లమెంటులో పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి గట్టిగా పనిచేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినందుకు సీఎంకు ఎంపీలు ధన్యవాదాలు తెలియజేశారు.
మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ మహర్దశను తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దుతున్నారంటూ సీఎంకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి ఈసందర్భంలో ముఖ్యమంత్రికి సరస్వతీ విగ్రహాన్ని బహూకరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వవాత నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తామని, అలాగే జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం ఎంపీలతో అన్నారు.
ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేతోపాటు నలుగురైదుగురు ముఖ్యమైన నాయకుల్ని త్వరలో కలుస్తానని సీఎం ఎంపీలకు చెప్పారు. సమావేశానికి 21 మంది లోక్‌సభ, 1 రాజ్యసభ సభ్యుడు హాజరయ్యారు.