ముఖ్యమంత్రి .జగన్ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది కంటే పక్కరాష్ట్రాల అబివృద్దిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం కన్నా విశాఖ శారదా పీఠమే సీఎం జగన్మోహన్ రెడ్డికి మిన్నగా కనిపిస్తున్నట్లుగా వుందని టిడిపి నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. దేశంలోనే అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం కన్నా స్వామీజి స్వరూపానంద శాసనమే జగన్ కు ఎక్కువనట్లుందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.
రాజధాని తరలింపుపై ఐదుకోట్ల ప్రజల ఆందోళనలు కూడా ముఖ్యమంత్రి జగన్ కు పట్టడం లేదన్నారు. ఏ ప్రాంతం వారికి ఎంత అసౌకర్యం ఉన్నా, ఎవరికెన్ని కష్టాలు ఎదురైనా తనకేమీ పట్టనట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అటు క్రిస్టియానిటి, ఇటు హిందూయిజం మధ్య తన ద్వంద్వ ప్రవృత్తి కప్పెట్టడానికే శారదాపీఠంకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారని అన్నారు.
హిందూ పుణ్యక్షేత్రాలు కాశీ, హరిద్వార్ లకు జగన్ ను తీసుకెళ్లి పరిశుద్ద పరిచి హిందూ ఓట్లకు చేరువ చేసి సీఎం అయ్యేందుకు దోహదపడింది ఈ స్వరూపానంద స్వామీజినే అని తెలిపారు.జగన్ క్రైస్తవుడు అయినప్పటికీ ఆయనతో హిందుత్వ విధానంలో యాగాలు చేయించింది కూడా ఈ స్వరూపానందేనని అన్నారు. తనకోసం ఇంతచేసిన స్వామీజి స్వరూపానందకు గురుదక్షిణగానే జగన్ రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారని యనమల ఆరోపించారు.
రాజధానిపై వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతికి రాసిన లేఖ, కేంద్రానికి పంపిన వినతి అర్ధరహితమైనవని అన్నారు. రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని భారత పార్లమెంటు ఆమోదించిందని.... ఏపి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ధ్రువీకరించిందన్నారు. ఇటీవల సర్వే డిపార్ట్ మెంట్ మ్యాప్ లో ఏపి రాజధానిగా అమరావతిని చూపకపోతే రాష్ట్ర ఎంపిలు పార్లమెంటులో నిరసనకు దిగినట్లు... దీంతో వెంటనే కేంద్రం అమరావతిని రాజధానిగా చూపిస్తూ మరో మ్యాప్ విడుదల చేసిందని గుర్తుచేశారు.
read more అమరావతి నిరసకారులపై పోలీస్ కేసులు... 18మందిపై పెట్టిన సెక్షన్లివే
భారత మ్యాప్ లో అమరావతి లేకపోవడాన్ని లోక్ సభలో రెయిజ్ చేసింది టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అయినా తమ ఎంపి మిధున్ రెడ్డి ఘనతగా అప్పట్లో వైసిపి చెప్పుకుందన్నారు. ఇప్పుడదే వైసిపి ఎంపి ఎందుకని నోరు తెరవడం లేదని యనమల ప్రశ్నించారు.
ఏపిలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తమ ఇళ్లనుంచి బైటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొల్పినట్లుగా ఉందన్నారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా మహిళలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. రాక్షస రాజ్యంగా రాష్ట్రాన్ని కేవలం 7నెలల్లోనే మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 12మంది టిడిపి కార్యకర్తలను హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత సృష్టించి 60మంది కార్మికులను ఆత్మహత్యలకు పురికొల్పారని యనమల మండిపడ్డారు. 200 రోజుల్లోనే 285మంది రైతులు ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమయ్యిందని ఆరోపించారు.
ఇప్పుడు రాజధాని తరలింపుపై ఆందోళనలతో 9మంది మరణించినట్లు యనమల వెల్లడించారు. వందలాది చిరుద్యోగుల ఆత్మహత్యా యత్నాలకు అంతేలేదని... ఇటువంటి విధ్వంసకర పాలన మున్నెన్నడూ చూడలేదన్నారు. సీఎం జగన్ ఏ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలుస్తున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. ఇది రాష్ట్రానికి మరింత నష్టం చేయడమే అవుతుందన్నారు.
read more 200 కోట్ల ఆదాయాన్ని కాదని... వారికోసమే 10లక్షల ఉద్యోగులపై వేటు: నారా లోకేశ్
ఇప్పటికే ఏపిలో పరిస్థితులు పొరుగు రాష్ట్రాల మంత్రుల ముందు నవ్వులపాలైందని... ఆయా రాష్ట్రాలకు ఏపిలో పరిస్థితులు ఏవిధంగా లాభదాయకమో అక్కడి మంత్రులే చెబ్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత నష్టం చేయడం, పొరుగు రాష్ట్రాలకు చేతనైనంత మేళ్లు చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలసీగా పెట్టుకున్నారని యనమల మండిపడ్డారు.
ఈ రోజు శారదాపీఠం స్వామీజితో భేటి, 13న తెలంగాణ సీఎం కెసిఆర్ తో భేటి వెనుక స్కెచ్ అందరికీ తెలిసిందేనని...ఈ ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు కాబట్టి లక్ష్యం ఒక్కటే అయి వుంటుందన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదని ప్రజలే అంటున్నారని యనమల రామకృష్ణుడు వెల్లడించారు.