గుంటూరు రూరల్ ఎస్పీగా విజయారావు... సిబిఐకి జయలక్ష్మి బదిలీ

By Arun Kumar PFirst Published Oct 14, 2019, 3:51 PM IST
Highlights

గుంటూరు రూరల్ ఎస్పీగా విజయరామారావు బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆయన ఈ జిల్లాకు ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడిన విషయం  తెలసిందే.    

గుంటూరు: జిల్లా రూరల్ ఎస్పీగా ఇటీవలే నియమితులైన ఐపీఎస్ అధికారి సీహెచ్ విజయారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న జయలక్ష్మి సీబీఐ ఎస్పీగా బదిలీ కావడంతో ఇటీవల ప్రభుత్వం నూతన ఎస్పీగా విజయారావును నియమించింది. ఈ మేరకు విజయారావు సోమవారం జయలక్ష్మి నుంచి బాధ్యతలు స్వీకరించారు.

గతంలో ఆయన గుంటూరు అర్బన్‌ ఎస్పీగా రెండేళ్లు పనిచేశారు. దీంతో జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులపై కొంత అవగాహన ఉంది. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... గ్రామీణ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా పరిధి చాలా విస్తృతమైనదని, స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితిని సమీక్షించాక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.

2014 జనవరి 1న సీనియర్ టైమ్ స్కేల్‌కు పదోన్నతి పొందిన విజయారావు 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.  ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 2010 ఆగస్టు 30 నుంచి 2012 జనవరి 6 వరకు వివిధ స్థాయిల్లో పోలీసు శాఖకు సేవలందించానే.  శిక్షణ పూర్తిచేసుకుని 2012 జనవరి 16న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో చేరారు. అక్కడ అదే ఏడాది ఫిబ్రవరి 12 వరకు ఉండి ఫిబ్రవరి 13న వరంగల్‌లో తొలి పోస్టింగ్ దక్కించుకున్నారు. 

అనంతరం విజయారావు సైబరాబాద్ కమిషనరేట్, నల్గొండ జిల్లాలో పనిచేశారు. అక్కడి నుంచి 2013 మార్చి 14న అనంతపురంలో కూడా సేవలందించిన తర్వాత అస్సాల్ట్ కమాండర్‌గా కొద్ది నెలలు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

సీఐడీ ఎఎస్పీగా హైదరాబాద్‌లో పనిచేసిన తర్వాత కొద్ది రోజుల వెయిటింగ్ తర్వాత విజయారావు విజయనగరంలోని ఎపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి 2017 జులై 3న గుంటూరు అర్బన్ ఎస్పీగా నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తూ విజయవాడ డీసీపీ-2గా బదిలీపై వెళ్లిన విజయరావు తిరిగి గుంటూరు రూరల్ ఎస్పీగా వచ్చారు.

విజయారావు పనిచేసిన ప్రతిచోటా సిబ్బంది సంక్షేమానికి, శాస్త్రీయ పద్దతిలో నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన అధికారిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
 

click me!