ఏపిలో ఇసుక కొరతపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని పరిష్కారం కోసం తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. నూతన ఇసుక పాలసీపై జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో సచివాలయంలో జరుగుతున్న వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన ఇసుక పాలసీపై వారితో చర్చించారు.
ముందుగా సామాన్య ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారరు. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని... దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలన్నారు. గత మూడు నెలలుగా వరద పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తాయని....అందువల్లే కొరత ఏర్పడిందని వివరణ ఇచ్చారు.
వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం పలు జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు సమర్పిస్తున్నారని... తక్షణమే ఈ దరఖాస్తులను ఆమోదించి, ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని అధికారులను సూచించారు.
ఇసుక సరఫరాపై జాయింట్ కలెక్టర్ లకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలన్న సీఎం ఆదేశాలను దృష్టిలో వుంచుకోవాలని సూచించారు. రీచ్ లకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ లను ముందుగానే గుర్తించాలి.ఓపెన్ రీచుల్లో వరద పరిస్థితి కారణంగా ఇసుక తవ్వకాలు చేయలేకపోతున్నామన్నారు.
గత మూడు నెలలుగా కృష్ణానదిలో వరద పరిస్థితి కొనసాగుతోంది కాబట్టి అక్కడ ఇసుకను తవ్వకాలు చేపట్టకాలు చేపట్టలేకపోతున్నాం. కాబట్టి ఇతర జలాశయాల్లో, స్థానిక జలవనరుల్లో మేటవేసిన ఇసుక నిల్వలను గుర్తించాలని ఆదేశించారు. వీటిని బయటకు తీయడం వల్ల అటు జలాశయాల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది, మరోవైపు ఇసుక సరఫరా మెరుగవుతుందని సలహా ఇచ్చారు.
మెదటి, రెండు, మూడు గ్రేడ్ లలోని రీచ్ లలో ట్రాక్టర్ లకు అనుమతి ఇస్తామన్నారు. గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్ ల వద్ద పెట్టి ఆన్‌లైన్ ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నట్లు తెలిపారు. మైనింగ్ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సమన్వయం చేసుకోవాలి సూచించారు.
ఇసుక లభ్యత వున్న జిల్లాల్లో ముందుగా స్థానికుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న సంబంధిత జిల్లా వాసులకు కొంతమేర ఇసుకను రిజర్వు చేయండి. ఇసుక అవసరాల కోసం ఆన్‌లైన్ లో వస్తున్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు.