అమరావతిలోనే ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని కొనసాగించాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన కొందరు మహిళలు మంగళవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు నాయుడిని కలిశారు.
గుంటూరు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, మహిళలు, రైతు కూలీలు మంగళవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుసుకుని తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఇలా చంద్రబాబును కలిసిన వారిలో గుంటూరు, అనంతపురం, విజయనగరం జిల్లాలకు చెందినవారున్నారు.
ఈ క్రమంలోనే విజయనగరం పట్టణానికి చెందిన మహిళ ఎంవి ప్రసన్నశ్రీ అమరావతి పరిరక్షణ జెఏసికి తన చేతి బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగానే అదే ఎన్టీఆర్ భవన్ లో జెఏసి ప్రతినిధులకు వాటిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విజయనగరంలో తమకు కావాల్సిన వన్నీ ఉన్నాయని... రాజధాని విశాఖకు రావడం వల్ల అదనంగా ఒరిగేదేమీ లేదని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయాలని చంద్రబాబునాయుడు నిరంతరం తపన పడ్డారని... ఆయన కష్టం ఫలించే సమయానికి ప్రభుత్వం మారడం భావితరాల దురదృష్టంగా చెప్పారు. విజయనగరంలో ఉండే తామంతా అమరావతి మహిళలు, రైతులు, రైతు కూలీలకే సంఘీభావం చెబుతున్నట్లు ప్రసన్నశ్రీ తెలిపారు.
read more జగన్ సర్కార్ పై మరోసారి హైకోర్టుకు...టిడిపి మిస్ లీనియస్ పిటిషన్
అలాగే అనంతరపురం నుండి వచ్చిన ఓ వికలాంగ మహిళ తనకు నిలువ నీడ లేకుండా ఇల్లు కూల్చేశారని చంద్రబాబుకు తెలిపారు. తనకిచ్చిన పట్టా స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుంటుంటే తోపుదుర్తి భూస్వాములు ఆక్రమించి కూలగొట్టారని రాచానపల్లి గ్రామం బిఎన్ ఆర్ కాలనీకి చెందిన వికలాంగురాలు లక్ష్మీనారాయణమ్మ భోరున విలపించింది. వికలాంగురాలని కూడా చూడకుండా తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని కన్నీరు మున్నీరు అయ్యారు.
12ఏళ్ల క్రితం సర్వే నెం 83/3A లో తనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా ఇచ్చిందని, గుంత పూడ్చి లెవెలింగ్ చేసుకుని, బేస్ మెంట్, గోడలు నిర్మించి, శ్లాబ్ కూడా వేసుకుంటే, తోపుదుర్తి గ్రామానికి చెందిన భూస్వాములు దాడిచేసి శ్లాబు కూలగొట్టి, ఇంటిని ధ్వంసం చేశారని కన్నీరు మున్నీరు అయ్యారు. అప్పోసప్పో చేసి రూ 2లక్షలతో కట్టుకున్న ఇల్లు కళ్లెదుటే నేలకూల్చారని వాపోయింది. 12ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నట్లు రెవిన్యూ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్, అక్టోబర్ 9న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును చూపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని చంద్రబాబును ఆమె కోరింది.