కాలకేయుడిలా జగన్... సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయేలా...: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Jan 18, 2020, 9:38 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిర్ణయాలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడంటూ టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ అసమర్థ, అవినీతి పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సీఎం జగన్ తన నిర్ణయాలతో రాష్ట్రంపాలిట కాలకేయుడిలా తయారయ్యాడని, పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చుపెట్టినట్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఆరనిజ్వాలలు రేపాడని  మండిపడ్డారు. 

శనివారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సీఎం జగన్ తో పాటు ఆయన అనుచరులు, తాబేదారులు కాలకేయుల్లా రాష్ట్రంపై పడ్డారని అభివర్ణించారు. ఇదివరకే రాజధానిగా నిర్ణయమైపోయిన అమరావతిని, ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఇతర శాఖల ప్రధాన భవనాలను విశాఖకు తరలిస్తామని చెప్పడం కాలకేయులు చేసే పనులుకావా అని ఆయన ప్రశ్నించారు. 

వెనుకటికెవరో అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారని చెప్పినట్లుగా జగన్‌ నిర్ణయాలు ఉన్నాయన్నారు. టీడీపీ పాలనలో రూ.4,000లకు లభించిన లారీ ఇసుక ఇప్పుడు రూ.8వేలు పలుకు తోందని, మిగిలిన రూ.4వేలు ఎవరిజేబుల్లోకి వెళుతున్నాయని వర్ల నిలదీశారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీవల్ల రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రానికి వెళుతోందని, కర్నూలు సరిహద్దుల్లోని గ్రామాలవారంతా మద్యంకోసం పక్కనున్న మహబూబ్‌నగర్‌లోని ఆలంపూర్‌కు వెళుతున్నారన్నారు. ఆలంపూర్‌లో మద్యం ధరలకు, కర్నూలులో మద్యం ధరకు రూ.40, రూ.50వ్యత్యాసం ఉందని, పెరిగిన ధరల వల్ల వస్తున్న ఆదాయం ఎవరి ఖాతాల్లోకి వెళుతున్నాయో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 

READ MORE  అమరావతి ఉద్యమంలో మరో విషాదం... రాజధాని కోసం ఆగిన మరో గుండె

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 5రకాల బ్రాండ్లే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ఆయా డిస్టిలరీ కంపెనీల యజమానులెవరో, వారిపై జగన్‌కు ఎందుకంత ప్రేమో చెప్పాలన్నారు. తాము సూచించిన మద్యం రకాలనే అమ్మాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, దానివల్ల ఎవరికిలాభమో స్పష్టం చేయాలన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలవల్ల రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్‌ రాజధాని నిర్ణయాన్ని తెరపైకి తెచ్చాడని వర్ల దుయ్యబట్టారు.      

తన నిర్ణయాలపై జగన్‌ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, 2013లో సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ తన గురించి ఏం చెప్పిందో ఆయన తెలుసుకోవాలన్నారు. జగన్‌కు ఇంతసంపాదన ఎలా వచ్చింది.. ఏంచేస్తే వచ్చిందని సుప్రీం డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు ఆశ్చర్యపోయినమాట వాస్తవం కాదా అని రామయ్య ప్రశ్నించారు. 

ఇటీవలే ఢిల్లీ హైకోర్టు కూడా చిదంబరం కేసులో జగన్‌ అవినీతిని ప్రస్తావించిందని, అలాంటి వ్యక్తి అవినీతి రహితపాలన అందిస్తానంటే ప్రజలెలా నమ్ముతారన్నారు. అనంతపురం, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలవాళ్లు మద్యంకోసం సరిహద్దులు దాటే పరిస్థితిని తీసుకొచ్చింది జగన్‌కాదా అని వర్ల నిలదీశారు. రాజధాని ప్రాంతంలో 144సెక్షన్‌ పెట్టడంపై హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుని తప్పుపట్టిందన్నారు. సంఘటనను బట్టి, సెక్షన్‌ 30 కొనసాగించినట్లుగా, సెక్షన్‌144 ఉంచడానికి వీల్లేదన్నారు. 

అబద్ధాలు, మోసం, అవినీతి అనే సాధనాలతో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజల్ని ఎలా రక్షిస్తుందన్నారు.  జగన్‌ నైతిక విలువలు పాటించే వ్యక్తే అయితే చెన్నై ఐఐటీ ఇచ్చినట్లుగా చెబుతూ తప్పుడు నివేదికను బోస్టన్‌ గ్రూప్‌ పేరుతో ప్రచారం చేసి ఉండేవారుకాదన్నారు. తమ నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో 151 మంది ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

READ MORE  ఇన్ సైడ్ ట్రేడింగ్... సర్వే నంబర్లతో సహా వారి బాగోతం బయటపెడతా: వైసిపి ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి బోగస్‌ గ్రూప్‌ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామంటే అంతకంటే దుర్మార్గం ఉండబోదన్నారు. బొత్స సత్యనారాయణ నోరుతెరిస్తే అన్నీ అబద్ధాలే వస్తాయన్నారు.  కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఆధారంగానే గత ప్రభుత్వం  రాజధానిగా అమరావతిని నిర్ణయించిందన్నారు. న్యాయస్థానం చెప్పకుంటే జగన్‌ప్రభుత్వం రైతులనోట్లో మట్టికొట్టి ఒక్కరోజులోనే రైతుల నిర్ణయాలు తీసుకొని తూతూమంత్రంగా ముగించేసేదేనని రామయ్య స్పష్టంచేశారు. 

సుభిక్షంగా ఉన్న మహిష్మతి లాంటి ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేయడానికి కాలకేయుల్లా జగన్‌, ఆయన అనుచరులు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. బోగస్‌ కమిటీలను పరిగణనలోకి తీసుకోకుండా నిష్ణాతులు, నిపుణులతో కమిటీ వేసి, రైతులు, రాష్ట్రప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే జగన్‌ రాజధానిపై ముందుకెళ్లాలని వర్ల హితవు పలికారు. 

జగన్‌, కేంద్ర హోంమంత్రిని ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు. తన కేసులనుంచి బయటపడటం కోసమా..లేక వ్యక్తిగత హజరునుంచి మినహాయింపు కోసం వెళుతున్నారా.. లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమా అసలు జగన్ పదేపదే డిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్‌ తననిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే చరిత్రలో నిలిచిపోతాడని రామయ్య అన్నారు.          

click me!