సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తుగ్లక్ పాలన మెుదలైందని చెప్పుకొచ్చారు. జగన్ ది తుగ్లక్ పాలన అని ప్రజల్లో ముద్రపడిపోయిందని విమర్శించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజులపాలనపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. జగన్ 100 రోజుల పాలనలో 125 తప్పులు చేశారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగన్ 100రోజుల పాలనపై బ్రోచర్ ను విడుదల చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.
100 రోజుల్లో 125 తప్పులు పేరుతో నాలుగు పేజీల బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తుగ్లక్ పాలన మెుదలైందని చెప్పుకొచ్చారు. జగన్ ది తుగ్లక్ పాలన అని ప్రజల్లో ముద్రపడిపోయిందని విమర్శించారు.
అమరావతి బ్రాండ్ ను నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనపై విసుగు చెందిన పెట్టుబడుదారులు వెనక్కి వెళ్లిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్లాన్ ను పూర్తిగా ధ్వసం చేశారంటూ నిప్పులు చెరిగారు.
వందరోజుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించిన సీఎం మరెవరూ ఉండరేమోనంటూ ఆక్షేపించారు. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు ధోరణితో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని తెలంగాణ ఆదాయం పెరుగుతోందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని వంచన ప్రభుత్వంగా అభివర్ణించారు. తాము విడుదల చేసిన బ్రోచర్ మెుదటి చార్జిషీటేనని త్వరలో మరోకటి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి ఉపయోగపడేలా ఏ ఒక్క పని జగన్ ప్రభుత్వం చేయలేదని మాజీమంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. కమీషన్ల కోసం రద్దులపై ఎక్కువ దృష్టిపెట్టారని విమర్శించారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసి వాటికి సున్నం రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ 100 రోజుల ప్రభుత్వంలో విధ్వంసాలు, దాడులు, రద్దులు తప్ప ఇంకేమీ జరగలేదన్నారు. వందరోజుల్లో 300 తప్పులు, 600 రద్దులు చేసిన ప్రభుత్వంగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చౌకదుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు న్యాయమైన బియ్యం అందిస్తామంటూ మాట మార్చిందంటూ విరుచుకుపడ్డారు కళా వెంకట్రావు.
ఈ వార్తలు కూడా చదవండి
రాజధానిపై గెజిట్ లేదన్న బొత్స: సెక్రటేరియట్ లో ఎందుకున్నారంటూ యనమల కౌంటర్
అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందా...?: రాజధానిపై బొత్స వ్యాఖ్యలు
చంద్రబాబు సర్కార్ అవినీతి చేస్తే సీబీఐ విచారణ జరిపించండి: ఎంపీ కేశినేని నాని