ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరతపై చిత్తశుద్దితో పనిచేస్తే కేవలం ఒక్కరోజులోనే పరిష్కరించవచ్చని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు సూచించారు. కానీ ఆ నిబద్దత, చిత్తశుద్ది వైఎస్సార్‌సిపి ప్రభుత్వానికి లేవన్నారు.
గుంటూరు: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.10వేలకే లారీ ఇసుక దొరికితే... వైఎస్సార్‌సిపి అత్యుత్తమం అన్న పాలసీతో ఇసుక ధర రూ.40వేలకు చేరిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. వరదల కారణంగానే ఇసుక దొరకడం లేదని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు బ్లాక్‌లో లారీ ఇసుకను రూ.లక్షల్లో అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారని అన్నారు.
వారు ఇసుక అమ్ముకోడానికి వరదలు అడ్డు రాలేదా...? అడిగినంత ఇస్తే ఎన్ని లారీల ఇసుకైనా ఇస్తామని వైసీపీ ఇసుక మాఫియా బహిరంగంగా ప్రకటిస్తుంటే వారికి వరదలు అడ్డు రాలేదా.? అని అన్నారు. లారీ ఇసుక టిడిపి హయాంలో రూ.10వేలకే ఇచ్చామని...దీన్ని మాఫియా అంటారా...? మరి లక్షకు అమ్మితే అత్యుత్తమమా...? అని ప్రశ్నించారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... టీడీపీ హయాంలో ఇచ్చినట్లు ఉచిత ఇసుక ప్రకటిస్తే ఒక్క రోజులో ఈ ఇసుక కొరత తీరిపోతుందని పేర్కొన్నారు.
read more చంద్రబాబు అజాగ్రత్త వల్లే ఇసుక కొరత...తమిళనాడు, కర్ణాటకలు ఏం చేశాయంటే..: కొడాలి నాని
ఇసుక మాఫియాతో కోట్లు బొక్కిన నాయకులే ఇప్పుడు కూలీల ఆకలిని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కూలీల ఆత్మహత్యలు, ఇసుక ధరలు తగ్గాలంటే టిడిపి హయాంలోని ఇసుక పాలసీయే సరైదని పేర్కొన్నారు. అలాంటి చర్యలు మాని సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేసిన వారికి, ఉద్యమానికి మద్దతిచ్చేవారి కాళ్ల మధ్య కర్ర పెడుతూ వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని చాటుకుంటోందని మండిపడ్డారు.
దాదాపు 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తే.. ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్థంకావడం లేదన్నారు. ప్రశ్నించేవారిపై, పోరాడే వారిపై నీతిమాలిన కుతంత్రాలకు పాల్పడడం దేనికి సంకేతమన్నారు. పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వానికి టిడిపి హయాంలోని ఇసుక పాలసీ కూడా మాఫియాలాగే కనిపిస్తున్నట్లుగా వుందన్నారు.
కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యలు కనిపించవా...? గోదావరి, కృష్ణ నుంచి 500 లారీల ఇసుకను తవ్వితీసే సామర్ధ్యం కలిగిన పడవలతో తవ్వి ప్రజలకు ఇవ్వకుండా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
read more video:వైజాగ్‌లో జనసేన లాంగ్ మార్చ్... ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే...: నాగబాబు
2011లో వచ్చిన వరదల కంటే ఇప్పుడొచ్చిన వరదలు పెద్దవా.? నాడు అంత పెద్ద వరదలు వచ్చినా.. ఎక్కడా ఇసుక కొరత రాలేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడొచ్చిన చిన్న వరదను సాకుగా చూపుతూ.. వైసీపీ ప్రభుత్వం కార్మికుల కడుపుకొడుతోందన్నారు. ఇసుక మాఫియా ద్వారా సంపాదించిన కోట్లు బొక్కి కడుపునింపుకున్న వైసీపీ మంత్రులకు.. ఉపాధి లేక కూలీలు వేస్తున్న ఆకలి కేకలు ఎగతాళిగా ఉన్నాయా.? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.