రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిలో వున్న తమ్మినేని సీతారాం తన గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు.
గుంటూరు: పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు పైత్యంతో ఉన్న తమ్మినేని సీతారాంకు తానేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. స్పీకర్‌పదవి చేపట్టిన తర్వాత ఆయనకి పైత్యంపాళ్లు మరీ ఎక్కువయ్యాయని దెప్పిపొడిచారు.
గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు పార్టీలు మారిన వ్యక్తి తమ్మినేని సీతారం అని... అలాంటి వ్యక్తిని గౌరవించి జగన్ స్పీకర్ పదవిచ్చాడని అన్నారు. శ్రీకాకుళంలో ఎవర్ని అడిగినా తమ్మినేని తప్పుడు వ్యవహరాలు తెలుస్తాయన్నారు.
తెలుగుదేశంలో, పీఆర్పీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ని విమర్శించాడని, ఇప్పుడు అదేనోటితో జగన్ భజన చేస్తున్నాడన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానన్న ఇంగితంతో సీతారామ్ మాట్లాడితే సహిస్తామని... అలాకాకుండా ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదన్నారు. ఆయన ఒకటంటే తాము రెండంటామని వెంకన్న తేల్చిచెప్పారు.
read more రూ.6వేల కోట్లతో రూ.55వేల కోట్ల ఆదాయం... అందుకు చేయాల్సిందిదే: కనకమేడల
స్పీకర్ పదవిలో ఉండి చంద్రబాబు లాంటి సీనియర్ నేతపై, రాజధాని రైతులపై ఇష్టానుసారం మాట్లాడటం ఆయనకు తగదన్నారు. చంద్రబాబుని విమర్శించే ముందు చంద్రుడిపై ఉమ్మేస్తే తనపైనే పడుతుందనే నిజాన్ని తమ్మినేనిలాంటివాళ్లు తెలుసుకోవాలన్నారు.
సీతారామ్‌కు నిజంగా తనజిల్లాపై అభిమానం, ప్రేమ ఉంటే అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని జగన్‌పై ఎందుకు ఒత్తిడి తేవడంలేదన్నారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్న వైసీపీ, విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతోందన్నారు.
అన్నిప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు విశాఖకు రావాల్సిన లులూ, ఆదానీగ్రూప్ వంటి కంపెనీలను, వేలాదిమందికి ఉపాధికల్పిస్తున్న మిలీనియం టవర్స్‌లోని ఐటీ కంపెనీలను తరిమేసినప్పుడు ఎందుకు ఆపలేదని బుద్దా నిలదీశారు. వైసీపీప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీలోని సభ్యులకున్న అర్హతలేంటో స్పష్టంచేయాలన్నారు.
read more బొత్సా... ఫినాయిల్ పంపించా, ఇకపై దాంతోనే...: మాజీ మంత్రి జవహర్ సీరియస్
శ్రీకాకుళం జిల్లావాసి అయిన తమ్మినేనికి ఆ జిల్లానేతలైన ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు చేసిన భూదోపిడీ గురించి తెలియదా అని వెంకన్న ప్రశ్నించారు. విజయనగరంలో బొత్సా సత్యనారాయణ, ఆయనసోదరులు చేసిన భూదందాల సంగతేంటో చెప్పాలన్నా రు. స్పీకర్‌స్థానంలో ఉన్న తమ్మినేని గౌరవమర్యాదలతో ప్రవర్తించకుంటే ఆయనస్థాయిని ఇతరులు మర్చిపోవాల్సి ఉంటుందని వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.