టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి గురించి అనుచితంగా మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ తన నోటిని ఫినాయిల్ తో కడుక్కోవాలని మాజీ మంత్రి కెఎస్ జవహర్ విమర్శించారు.
గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అజ్ఞానం, ఆవేశం, అనుభవరాహిత్యం, అహంకారంవల్లే రాష్ట్ర ప్రజల్లో అయోమయం, ఆందోళన, గందరగోళం నెలకొన్నాయని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి కేఎస్.జవహర్ ఎద్దేవాచేశారు. గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జగన్ ఎలా వ్యవహరిస్తున్నాడో ఆయన కేబినెట్ మంత్రుల కూడా అలానే ఉన్నారన్నారు. యథా రాజా తథా పరివారం అన్నట్లుగా ఆయన మంత్రుల ప్రవర్తన ఉందన్నారు. మంత్రి బొత్స ఏదో మాట్లాడదాం అనుకొని ఇంకేదో చెబుతూ అయోమయానికి గురవుతుంటారని, అలాంటి వ్యక్తి భువనేశ్వరి గారిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రజల సమస్యలపై అమ్మవారికి మొక్కుకుందామని వచ్చిన ఆమె తీరుని తప్పుపట్టడం బొత్సకే చెల్లిందన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్, భర్త చంద్రబాబునాయుడు, కుమారుడు లోకేశ్‌లు ఎన్నికల్లో పోటీచేసిన సందర్భాలున్నా ఆమె ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. రాజధాని రైతులు రోడ్డునపడ్డారన్న ఆవేదనతోనే ఆమె అమరావతి పర్యటనకు వెళ్లారని, రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తీరాలని కనకదుర్గమ్మకు మొక్కుకున్నారని అన్నారు. ఈ అంశాలను కూడా వక్రదృష్టితో చూడటం, వంకరగా మాట్లాడే బొత్సకే సాధ్యమైందని జవహర్ మండిపడ్డారు.
బొత్స తననోటిని ఫినాయిల్‌తో శుద్ధి చేసుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశారు. రైతుల కోసం గాజులిచ్చిన ఆడపడుచుపై నోరుపారేసుకున్న బొత్స సత్యనారాయణ ముందుగా తననోటిని ఫినాయిల్‌తో శుద్ధి చేసుకోవాలని, అందుకోసం ఆయనకు ఒక ఫినాయిల్ బాటిల్ పంపుతున్నామని టీడీపీ నేత స్పష్టం చేశారు.
ఇన్‌సైడ్‌ట్రేడింగ్ గురించి ఇష్టానుసారం నోరుపారేసుకుంటున్న బొత్స అసలు దానిగురించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఐదేళ్లలో జరిగిన భూక్రయవిక్రయాల గురించి, రిజిస్ట్రేషన్ వ్యవహారాల గురించి తెలుసుకోకుండా ఇన్‌సైడ్ ట్రేడింగ్ అనడం తప్పులుమాట్లాడే బొత్సకే కుదిరిందన్నారు.
read more భువనేశ్వరి గాజుల విరాళం వివాదం... వైసిపి కౌంటర్లకు టిడిపి స్ట్రాంగ్ రియాక్షన్
విశాఖపట్నంలో కేవలం7నెలల్లో 55వేల ఎకరాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిన విషయం తెలుగులో మాట్లాడినా స్పష్టతరాని మంత్రికి తెలియదా అని మాజీమంత్రి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో నూటికి 70శాతం బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని, ఈ వాస్తవం తెలుసుకోకుండా కేవలం ఒకసామాజిక వర్గంపైనే విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. నిజంగా జగన్, ఆయన అనుచరులు చెబుతున్నట్లుగా ఒకే సామాజికవర్గానికి రాజధానిలో లబ్ధి కలిగినట్లయితే, ఆ వర్గానికి చెందినవారిని తక్షణమే తన మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి తొలగించాలని జవహర్ సూచించారు.
సీఆర్డీఏ పరిధిలో పత్తిపాడు, తాడికొండ, పామర్రు, నందిగామ నియోజ కవర్గాలున్నాయని, ఇవన్నీ దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్నవేనన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో 40శాతానికిపైగా ఎస్సీ ఓటింగ్ ఉందని, ఈలెక్కన చూస్తే జగన్ ఏ వర్గానికి అన్యాయం చేస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే దళితులు, వారికుటుంబాలు బాగుపడతాయని, వారంతా తెల్లచొక్కా లు ధరించి గుర్రాలపై తిరుగుతారన్న అక్కసుతోనే జగన్ రాజధానిని మారు స్తున్నాడన్నా రు.
జగన్‌కి మూడుముక్కలాట అంటే ఎంతో ఇష్టమని, అందుకే రాజధానిని మూడు ముక్కలు చేశాడన్నారు. జగన్ అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో స్పష్టం చేయాలని జవహర్ డిమాండ్ చేశారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విద్వేషాలతో ప్రజల్ని మోసం చేసిన జగన్ మోసమనే మాటపై పేటెంట్‌రైట్స్ పొందాడన్నారు.
హైకోర్టు పేరుతో కర్నూలువాసుల్ని, రాజధాని పేరుతో విశాఖవాసుల్ని మోసం చేస్తున్నాడన్నారు. తనకులాన్ని దాచి ప్రజల్ని మోసంచేసి టిక్‌టాక్‌లు చేసుకుంటున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి భువనేశ్వరిగారిపై విమర్శలు చేసే హక్కులేదన్నారు.
read more దుర్గమ్మ గుడికొచ్చి... ధర్నాకెళ్లారు, అంతా డ్రామానే: బాబు దంపతులపై బొత్స ఫైర్
లోకేశ్ ముందు చేతులుకట్టుకొని, చంద్రబాబు ఇంటిముందు రోజులతరబడి పడిగాపులు పడ్డాడన్న విషయం మర్చిపోయిన ఎర్రబెల్లి కేవలంకేటీఆర్ మెప్పుకోసం అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేదిలేదని జవహర్ హెచ్చరించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుగా ఎర్రబెల్లి మాటలున్నాయన్నారు.
ప్రజలతరపున పోరాడే ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబుకు అన్ని అర్హతలు ఉన్నాయన్న పచ్చినిజాన్ని బొత్స గ్రహించాలన్నారు. నిజంగా జగన్‌కు ధైర్యముంటే సీఆర్డీఏ పరిధిలోని ఏదో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించాలని , అప్పుడు అమరావతి తరలింపుపై ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో బోధపడుతుందని జవహర్ తెలిపారు.