ప్రసార మాద్యమాల్లోనే జగన్ ది గొప్ప పాలన... పబ్లిక్ లో కాదు: టిడిపి ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Dec 6, 2019, 9:20 PM IST
Highlights

వైఎస్సార్ సిపి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి కేవలం ప్రసారమాధ్యమాల ద్వాారా డబ్బాకొట్టించే పని మాత్రమే చేస్తోందని టిడిపి  ఎమ్మెల్యేే నిమ్మల రామానాయుడు విమర్శించారు.  

అమరావతి: వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ అరకొరగా, తూతూమంత్రంగానే అమలవుతున్నాయని టిడిపి  ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వీరి ఆరునెలల పాలనలో రెండు, మూడు సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని... కొన్నిపథకాలైతే కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని టీడీపీ  రామానాయుడు స్పష్టం చేశారు. 

శుక్రవారం ఆయన మంగళగిరిలో నూతనంగా ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలన ఆసాంతం ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు, మంత్రుల కల్లబొల్లి మాటలకే పరిమితమైందన్నారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన పథకాలన్నింటినీ అటకెక్కించారని నిమ్మల మండిపడ్డారు. 

టీడీపీ హాయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చిన రుణాలను, వైసీపీ ప్రభుత్వం సగానికిపైగా తగ్గించిందని...  బడ్జెట్లో కేటాయింపులు కూడా అరకొరగా చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పిన జగన్‌ ఇప్పుడు దాని ఊసేఎత్తడం లేదన్నారు. ప్రస్తుత పాలనలో నిత్యావసరాలధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఒక్క కేజీ ఉల్లి రూ.150 పలకడం రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. 

ఉల్లిధరలపెరుగుదల, నిత్యావసరాలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని, రివర్స్‌టెండరింగ్‌ పేరుతో పోలవరం పనులు ఆపేశారని  ఈ రెండు అంశాలపై కూడా టీడీపీ తరుపున చర్చ జరిగేలా చూస్తామన్నారు. 

read more టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం... తొలిరోజే టీడిఎల్పీ సమావేశం

ఇసుకపై  ప్రభుత్వపెత్తనం వల్లే రాష్ట్రంలో ఇసుక లభించడంలేదన్నారు. జే-ట్యాక్స్‌ వసూలు కోసం మద్యం ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచుతున్నారని రామానాయుడు తెలిపారు.  రాష్ట్రంలో ఏ పంటకు  గిట్టుబాటుధర లభించడంలేదని, ఎక్కడైనా కొనుగోళ్లు జరిపినా రైతులకు సొమ్ము అందడంలేదన్నారు. 

శనగలను కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకుంటే రూ.45వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వ మాట కేవలం ప్రకటనకే పరిమితమైందన్నారు. పత్తికి కూడా సరైన  ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 

 నియామకాలపేరుతో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపునకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పాదయాత్రలో లక్షల ఉద్యోగాలిస్తాననిచెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉన్నఉద్యోగాలను తీసేస్తున్నాడన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో నిర్మితమైన గృహాల తాలూకా బిల్లులను అర్థంతరంగా నిలిపివేశారని, గృహనిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. మిషన్‌బిల్డ్‌ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకానికి సిద్ధమైన ప్రభుత్వ చర్యలను అసెంబ్లీసాక్షిగా ఎండగడతామని రామానాయుడు తేల్చిచెప్పారు. 

read more దిశ నిందితుల ఎన్కౌంటర్... మంత్రిగా కాదు ఆడపిల్ల తండ్రిగా చెప్పేదిదే: మంత్రి అవంతి

మీడియాపై ఆంక్షలు విధించేలా తీసుకొచ్చిన జీవో2430 పై కూడా చర్చజరిగేలా చూస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, వివేకా హత్యకేసు వంటి అంశాలుకూడా అసెంబ్లీలో చర్చించేలా చూస్తామన్నారు. 

కేవలం 6నెలల్లోనే చెత్త ముఖ్యమంత్రిగా పేరుపొందిన జగన్‌ నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలన్నింటిపై శాసనసభ, మండలిలో చర్చకు వచ్చేలా టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజలసమస్యలు ఎక్కువగా ఉన్నందున అసెంబ్లీ కనీసం 15రోజులపాటు నిర్వహించాలని ప్రతిపక్షపార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. అధికారపార్టీకి, ప్రతిపక్షానికి స్పీకర్‌ ఇరుసులా వ్యవహరిస్తేనే  ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని రామానాయుడు సూచించారు.

click me!