ఎస్సీలకు కావాల్సింది మొసలికన్నీరు కాదు... అదొక్కటి చేస్తే చాలు :వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Jan 21, 2020, 3:32 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ సామాజికవర్గాన్ని మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారని టిడిపి సీనియర్ నాయకులు, వర్ల రామయ్య ఆరోపించారు. 

దళితుల పట్ల ప్రేమున్నట్లుగా నటిస్తూ ముఖ్యమంత్రి జగన్ మొసలికన్నీరు కారుస్తున్నారని  టిడిపి సీనియర్ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. 
ఎస్సీ వర్గీకరణ చేసే ధైర్యం వైసిపికి ఉందా...? అని ఆయన నిలదీశారు. దళిత వర్గాల్లో ఒక వర్గానికే కొమ్ముకాస్తున్న వైసిపి రెండో వర్గాన్ని విస్మరించడం హేయం,అన్యాయమన్నారు.

ఆత్మకూరులో రెండు వందల దళిత కుటుంబాలు వైసిపి కార్యకర్తల దాష్టీకానికి  గురై ఊరువదిలి పారిపోయినా కనీసం పట్టించుకోకపోవడం జగన్ దుర్మార్గానికి  మచ్చుతునక అని విమర్శించారు. దళితుల పట్ల ముఖ్యమంత్రి కపట ప్రేమ చూపిస్తున్నారని... పల్నాడులో దళిత మహిళను వివస్త్రను చేసి ఆత్మహత్యకు పాల్పడేలా ఘోరంగా అవమాన పరిచిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని వైసిపి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. 

ఎస్సీ, ఎస్టీలపై టీడీపీకి వున్నది అతి స్వచ్చమైన ప్రేమ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుగుదలపై వైసిపి ఏనాడూ దృష్టి పెట్టలేదని...  కానీ ఆ సామాజికవర్గాల ప్రజల ఓట్లు దండుకున్నారని అన్నారు. వారి సంక్షేమాన్ని విస్మరించింది వైసిపి  కాదా? అని ఆయన  ప్రశ్నించారు. 

read more  ఏపికి మూడు రాజధానులు... కేంద్ర ప్రభుత్వ జోక్యం వుండదు...: బిజెపి ఎంపీ జివిఎల్

అమరావతి రాజధాని తరలింపు బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా ఇక్కడి ఐదు నియోజకవర్గాల ప్రజల ఆశలను, అభివృద్ధిని జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.   ఇడుపులపాయలో వందల ఎకరాలను ఆక్రమించినట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో అసెంబ్లీలోనే ఒప్పుకోవడం దళితులకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ఆయన కుమారుడు జగన్ తండ్రి కంటే మరెన్నో రెట్లు దళితులను స్వలాభం కోసం వాడుకుని అణగారిన వర్గాలుగానే మిగల్చాలని కుట్రపన్నుతున్నాడని వర్ల ఆరోపించారు.

టిడిపి ఎస్సీల సంక్షేమానికి  2019-20 బడ్జెట్ లో రూ.14,367 కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి సిద్ధమయితే  ఈ ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన నిధుల్లోంచి రూ.1500  కోట్లను ''అమ్మ ఒడి'' పథకానికి మళ్ళించిందన్నారు.  ఎస్సీ,ఎస్టీ వర్గీయులకు ప్రతి విషయంలో మాటలకే పరిమితమవుతూ జగన్ మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. 

ఎనిమిది నెలలుగా వైసిపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు పాటుపడటమే కాక భారీ నిధులను కేటాయించి చంద్రబాబు దళిత పక్షపాతిగా నిలిచారన్నారు. లోక్ సభ స్పీకర్ పదవిని బాలయోగికి, అసెంబ్లీ  స్పీకర్ పదవిని ప్రతిభా భారతికి కట్ట బెట్టిన ఘనత తెలుగుదేశంకే దక్కుతుందన్నారు.

read more  అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

''ఆర్ధిక,రెవిన్యూ వంటి ప్రధాన శాఖలకు మంత్రులుగా ఎస్సీ, ఎస్టీ లకు చెందిన వారిని నియమించిన చరిత్ర టిడిపి. ఎస్సీ,ఎస్టీ కమిషన్లు వేసి కమిషన్ చైర్మన్ పున్నయ్య ఇచ్చిన 41  సూచనలను ఆమోదించి అమలు చేసింది టిడిపి. దళిత యువత స్వశక్తిపై నిలబడటానికి వేయి ఇన్నోవా కార్లను ఇచ్చి ప్రోత్సహించింది ఇదే తెలుగుదేశం. విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించేందుకు రుణాలు ఇచ్చాము.ఇలా ఎస్సీ,ఎస్టీ ల ఉన్నతికి నిరంతరం పాటుపడింది టిడిపి మాత్రమే'' అని వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీపై ప్రశంసలు  కురిపించారు. 

 

click me!