వైసిపి ప్రభుత్వం అక్రమార్జన కోసం రాష్ట్ర ప్రజల్ని జలగల్లా పీడిస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత కారణంగా 30 లక్షల వరకు భవన నిర్మాణ కార్మికులు ఒక పూట తింటూ పస్తులుండే దుస్థితి దాపురించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వాపోయారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారపార్టీ అవినీతి, అక్రమాల గురించి మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వం, సాక్షి మీడియా ఎంతటి విషప్రచారం చేసిందో , అసలు వాస్తవం ఏంటో ఐటీశాఖ విడుదలచేసిన పంచనామాతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్యాలు, అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మద్యపాననిషేదం ముసుగులో జగన్ కు జే ట్యాక్స్ చెల్లించే డిస్టిలరీ కంపెనీల మద్యం బ్రాండ్లనే క్వార్టర్ కు రూ. 70 నుంచి రూ.150 వరకు అదనంగా అమ్ముతున్నారన్నారు.
read more తల్లీ, చెల్లీ వల్లే జగన్ కు సీఎం పీఠం... కానీ ఇప్పుడు...: వంగలపూడి అనిత
అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తూ రూ.1000 వెనక్కితీసుకుంటున్నారని... తొలుత 84 లక్షల మంది తల్లులకు అమ్మఒడి నిధులు ఇస్తామని చెప్పి 42 లక్షలకు కుదించడం జరిగిందన్నారు. ఏ రూపంలోనైతేనేమి సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల వరకూ జగన్ ప్రభుత్వం ప్రజల నుంచి జలగల్లా పీల్చివేస్తోందన్నారు.
7 లక్షల పింఛన్లు, 19 లక్షల రేషన్ కార్డులు తీసేసిన జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత ప్రభుత్వం కేటాయించిన స్వయం సహాయక రుణాలు ఇవ్వకుండా వారికి మొండిచెయ్యి చూపిందన్నారు. ఎన్ఎస్‌ఎఫ్‌డిసి వంటి పథకాల ద్వారా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీలకు అందే రుణాలను కూడా జగన్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
read more బిజెపి పొత్తు వారితోనే... టిడిపి ఎంతో మిగతా పార్టీలు అంతే...: కన్నా
ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ వర్గానికి ఒక్క పైసా కూడా నిధులు మంజూరు చేయని ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతి ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఐటీ దాడుల అంశాన్ని తెరపైకి తెచ్చారని, చంద్రబాబు నాయుడే రూ. 2 వేల కోట్లు దోచేశారని విష ప్రచారం చేశారన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పడం ద్వారా నిజం చేయాలనే పాత విధానాన్నే ఇప్పటికీ జగన్ అండ్ కో అమలు చేస్తున్నారని ఆనంద్ బాబు మండిపడ్డారు.