రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడానికి మహిళల ఆశీర్వాదమే కారణమని... అలాంటి మహిళలనే ముఖ్యమంత్రి జగన్ రోడ్డుపైకి తీసుకువచ్చి హింసించడం దారుణమని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున తల్లి, చెల్లి ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరారని... ఆ విధంగా ఆయన అధికారం చేపట్టడానికి వారు సహకరించారని తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని మహిళల ఆశీర్వాదం కూడా వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడైందని అన్నారు. ఇలా మహిళాభిమానంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు అదే మహిళామణులను రోడ్లపైకి తీసుకొచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం ఆమె మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర సమయంలో అక్కా, చెల్లీ అంటూ హామీలతో ఊదరగొట్టిన జగన్ రూ. 10 వేల జీతం ఇస్తానంటూ యానిమేటర్లు, మెప్మా ఆర్పీలకు ఆశలు కల్పించడం జరిగిందన్నారు. అదే హామీపై ప్రశ్నించారన్న అక్కసుతో నేడు 37 వేల మంది యానిమేటర్లు, ఆర్పీలను పోలీసులతో కొట్టించడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. మహిళలని కూడా చూడకుండా ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అనే విచక్షణ కూడా లేకుండా మగ పోలీసులే వారిని ఈడ్చుకెళ్లడం ఎంతటి దారుణమో ప్రజలు ఆలోచించాలన్నారు.
జగన్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించడమే వారు చేసిన నేరమా అని అనిత ప్రశ్నించారు. పెంచుతామన్న రూ. 10 వేల జీతం గురించి ప్రశ్నిస్తే, అమ్మఒడి ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని, అమ్మఒడి పేరుతో నిధులు ఇస్తూ నాన్న జేబుకు చిల్లు పెట్టడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇప్పటివరకూ అమలు చేసిన అన్ని పథకాల మాదిరే తల్లులకు డబ్బులిచ్చే అమ్మఒడిలో కా జగన్ ప్రభుత్వం కోతలు పెట్టిందన్నారు.
read more బిజెపి పొత్తు వారితోనే... టిడిపి ఎంతో మిగతా పార్టీలు అంతే...: కన్నా
గతంలో 84 లక్షల మంది తల్లులకు నిధులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దాన్ని 40 లక్షలకే పరిమితం చేశారన్నారు. ఇద్దరు పిల్లలు ఉండకూడదు , రేషన్ కార్డు ఉండకూడదనే నిబంధనలతో ఆ పథకాన్ని నీరుగార్చారన్నారు. తల్లి తన ఒడిని ఇద్దరు పిల్లలకు సమానంగానే పంచుతుందని, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఒడిని ఒక్కరికే పరిమితం చేశారని అనిత ఎద్దేవా చేశారు.
అమ్మఒడి పథకం నిధులు పొందిన జాబితాలో యానిమేటర్లు , ఆర్పీలు ఉంటే వారికి జీతాలు ఇవ్వమనడం, అదే పథకానికి అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రావని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించి తిరిగి అవే నిధులు పొందిన లబ్ధిదారులకు ఇతర పథకాలు వర్తించవని చెప్పడం ఎలాంటి పరిపాలన కిందకు వస్తుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పింఛన్లు రూ. 3000 వేలకు పెంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలో రాగానే 7లక్షల పింఛన్లు తీసేశాడన్నారు. పింఛన్ల తొలగింపు, రేషన్ కార్డుల తీసివేత , అమ్మఒడి కోత, ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిల నిలుపుదల వంటి చర్యల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఏడుపునే మిగిల్చారన్నారు. జగన్ పాలనలో విద్యార్థులు, తల్లులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఏడుపులే మిగిలాయన్నారు.
read more దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే వాళ్లే వాళ్లంతా...: అచ్చెన్నాయుడు
తన తండ్రి ఇచ్చిన రేషన్ కార్డులను కూడా పిచ్చి పిచ్చి నిబంధనలతో తీసేయడం జగన్ కే సాధ్యమైందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే 37 వేల మంది యానిమేటర్లు, ఆర్పీలను మోసం చేయవద్దని అనిత హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం నుంచి వివిధ రకాల కారణాలతో తిరిగి అదనపు వసూళ్లు చేస్తున్నారని అదంతా జగన్ జే ట్యాక్స్ లో భాగమేనన్నారు.
దిశా చట్టంపై అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన వైసీపీ మహిళా నేతలంతా, రాష్ట్రంలో అమాయకులైన బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు నోరెత్తడం లేదన్నారు. “ దిశా” చట్టమో.. పథకమో ప్రభుత్వం స్పష్టం చేయాలని... చట్టమనేది ప్రజలకు మేలు చేస్తుందని, పథకమైతే ప్రజలకోసం అమలు చేసేదని ఈ రెండింటికి తేడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనిత అన్నారు.