అమరావతి ప్రాంతంలో తమకు భూములున్నట్లు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించడాన్ని టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తప్పుబట్టారు.
అమరావతి: ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణాన్ని స్వాగతించిన జగన్, ముఖ్యమంత్రయ్యాక రాజధానిపై విషంచిమ్మే ప్రయత్నాలుచేయడం దురదృష్టకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాజధాని ఎక్కడాపెట్టినా స్వాగతిస్తామని, ప్రాంతాల మధ్య విబేధాలు రాకుండా చూడాలని ప్రతిపక్షనేతహోదాలో ఆనాడు అసెంబ్లీలో జగన్ మాట్లాడిన విషయాన్ని దూళిపాళ్ల గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మూడురాజధానులంటూ రైతులను రోడ్డున పడేసేలా మాట్లాడుతూ వారిని ఎందుకు బలిపశువులను చేస్తున్నారని నరేంద్ర నిలదీశారు.
నిండుసభలో రాజధానిని సమర్థించిన వ్యక్తే ఇప్పుడు మాటతప్పాడని, అదేనా జగన్ విశ్వసనీయత అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. రాష్ట్రంకోసం తమభూములు త్యాగంచేసిన రైతుల జీవితాలతో ఆడుకోవడమేనా ప్రభుత్వ విశ్వసనీయత అన్నారు. కన్నతల్లికన్నా మిన్నగా చూసుకునే భూముల్ని రాజధానికి ఇచ్చిన రైతులు నేడు రోడ్లమీదకు రావడానికి జగన్మోహన్‌రెడ్డే కారణమన్నారు.
read more రాజధానిపై జగన్ ప్రకటన... రాష్ట్రమే మూడు ముక్కలయ్యే ప్రమాదం: రావెల ఆగ్రహం
రాష్ట్రం విడిపోయినప్పుడు మనరాష్ట్రంలో మనముండాలనే భావనతో ఇక్కడ నివసించడానికి భూములుకొంటే దాన్నిసాకుగా చూపుతూ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాద్ధాంతం చేశాడని ధూళిపాళ్ల మండిపడ్డారు. ఎవరికి ఎంతెంత భూములన్నాయో చెబుతున్న ప్రభుత్వం అవి ఎప్పుడు కొన్నారో తెలుసుకొని చట్టవిరుద్ధంగా జరిగిన కొనుగోళ్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ఎందుకు సంకోచిస్తోందని ఆయన నిలదీశారు.
రాజధానిలో భూముల వ్యవహారంపై సీఐడీ విచారణ పేరుతో అధికారులను ఇంటింటికీ తిప్పుతూ విచారణ జరుపుతూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఏం సాధించిందన్నారు. అమరావతి ప్రాంతంలో పుట్టిపెరిగినవాళ్లుగా ఇక్కడ భూములు కొనుక్కుంటే తప్పేంటని ధూళిపాళ్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జగన్మోహన్‌రెడ్డిలా తమకు 32ఎకరాల్లో బెంగుళూరులో ఒకఇల్లు, హైదరాబాద్‌లో మరోఇల్లు, కడపలో ఇంకోఇల్లు లేదని, తమకున్నది ఒక్కటే ఇల్లని, ఒకేప్రాంతమని ఆయన చెప్పారు. భూములుకొన్నవారి పేర్లుచెబుతున్న ప్రభుత్వం, లోపభూయిష్ట విధానాలకుపాల్పడి, చట్టవిరుద్ధంగా కొన్నవారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు.
చంద్రబాబునాయుడు అడిగినవెంటనే మనరాజధాని-మన ప్రాంతమనే ప్రేమతో 23వేలమంది రైతులు 33వేల500 ఎకరాలను రాష్ట్రం కోసం త్యాగంచేస్తే వారిపై కక్షసాధింపులకు పాల్పడటం ఎంతమాత్రం భావ్యం కాదన్నారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలన్న ఉద్దేశం జగన్‌కు ఉంటే జీఎన్.రావు కమిటీ నివేదిక రాకముందే ఇలా మూడు రాజధానులంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవాడు కాదన్నారు.
ఎవరి ప్రయోజనాలకోసం ఆ కమిటీ వేశారో సమాధానం చెప్పాలన్నారు. అపరిమితమైన అధికారముంది కదా అని అహంభావంతో ప్రవర్తించడం జగన్మోహన్‌రెడ్డికి తగదని నరేంద్ర హితవుపలికారు. 1910లో జాతుల మధ్యవైరం కారణంగా మూడు రాజధానులతో సౌతాఫ్రికా ఏర్పడిందని, ఆవిషయం కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఒకరాష్ట్రాన్ని ఆదేశంతో పోల్చడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఈవిధంగా జగన్‌కు సలహాలిస్తున్న సలహాదారులను సన్మానించాలన్నారు.
read more జగన్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ... త్వరలోనే 'రంగు'పడుద్ది: వర్ల రామయ్య
చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడితే జగన్ అధికార వికేంద్రీకరణ అంటున్నాడని ఎవరి ప్రయోజనాలకోసం ఆయన ఈ సూచనలు చేస్తున్నాడని నరేంద్ర ప్రశ్నించారు. జగన్ నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారితే తెలంగాణకు వరంగా మారాయన్నారు.
దోపిడీదారులనే ముద్రవేసి జగన్‌ప్రభుత్వం వెళ్లగొట్టిన ఆదానీగ్రూప్, సింగపూర్ కన్సార్టియం, లులూగ్రూప్‌వంటి సంస్థలన్నీ తెలంగాణకు పెట్టుబడిదారుగా మారి ఆరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయన్నారు. జగన్-కేసీఆర్‌ల మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇంతకన్నా గొప్పనిదర్శనం లేదన్నారు. రైతులకు అన్యాయం చేయవద్దని, పెట్టుబడులను పక్కరాష్ట్రాలపాలు చేయవద్దని చేతులుజోడించి జగన్‌కు విజ్ఞప్తిచేస్తున్నట్లు నరేంద్ర తెలిపారు.