కంటి వెలుగుతో జగన్మోహన్ రెడ్డి కనికట్టు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది మరో జగన్నాయని, టిడిపి ప్రభుత్వ పథకం పేరుమార్చి, ప్రజలను ఏమారుస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
టీడీపీ ముఖ్యనేతలతో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగుతో జగన్మోహన్ రెడ్డి కనికట్టు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇది మరో జగన్నాయని, టిడిపి ప్రభుత్వ పథకం పేరుమార్చి, ప్రజలను ఏమారుస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. టిడిపి హయాంలో 13జిల్లాలలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టి 67లక్షల మందికి ఉచిత చికిత్స చేసి, 3లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చామని బాబు గుర్తు చేశారు.
ఇప్పుడు దానినే ‘కంటి వెలుగు’గా మార్చి ప్రజల కళ్లు గప్పాలని చూడటం దివాలాకోరుతనమని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆటోలకు పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది పోటిపడి జగన్ స్టిక్కర్లు అతికించడం నవ్వుల పాలైయ్యారని ఆయన గుర్తు చేశారు.
రవాణా శాఖ, పోలీసుల అత్యుత్సాహాన్ని ఖండిస్తున్నామని, ఇదేనా మీ విధి నిర్వహణ..? మీరు చేయాల్సిన విధులు ఏమిటి..? మీరు చేస్తున్న పనులు ఏంటి.. అంటూ ఫైరయ్యారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న భూమా అఖిలప్రియను అణగదొక్కడానికే ఆమె భర్త భార్గవ రామ్ పై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ(నరేగా)పథకం పనులకు కేంద్రం ఇచ్చిన డబ్బులు 3రోజుల్లో విడుదల చేయాలని, లేని పక్షంలో 12% వడ్డీతో సహా కలిపి ఇవ్వాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. నరేగా నిధులను ఏమయ్యాయి..? దేనికి మళ్లించారని బాబు ప్రశ్నించారు.
జగన్ ట్యాక్స్ (జె ట్యాక్స్) విధించి మద్యం ధరలు పెంచేశారని.. చివరికి తాగుబోతులను కూడా వదలకుండా జలగల్లా పీలుస్తున్నారని ఆయన ఆరోపించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ నియామకాలన్నీ పెద్ద గోల్ మాల్ గా తయారైందని.. లక్షలాది చిరుద్యోగులను వేధింపులకు గురిచేసి అన్యాయంగా తొలగించారని చంద్రబాబు దుయ్యబట్టారు.
వాలంటీర్ల ముసుగులో వైసిపి కార్యకర్తలకు జీతాల పేరుతో వేలకోట్లు దోచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముడుపుల కోసం వేధించడం వల్లే పెట్టుబడిదారులు అంతా పారిపోతున్నారు.
విద్యుత్ కోతలతో రైతులు, పారిశ్రామిక వేత్తలు ఇబ్బందుల పాలయ్యారని.. ఇసుక కొరతతో లక్షలాది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు. టిడిపి నేతలపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అటు పొలిటికల్ యాక్షన్ తోపాటుగా ఇటు లీగల్‌గా కూడా వెళతామని తెలుగుదేశం అధినేత స్పష్టం చేశారు.