గురజాల పంచాయితీ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గుంటూరు: జిల్లాలోని గురజాల పంచాయితీ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడిచేశారు. ఓ ఇంటి ప్లానింగ్ కోసం 20వేలు లంచం తీసుకుంటూ పంచాయితీ గుమాస్తా అడ్డంగా బుక్కయ్యాడు. ముందస్తు సమాచారంతో కాపుగాచిన అవినీతి నిరోధక శాఖ అధికారులు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
తన ఇంటి ప్లానింగ్ అనుమతి కోసం సరికొండ పూర్ణంరాజు పంచాయితీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందుకోసం తనకు రూ.40వేలు లంచంగా ఇవ్వాలని పంచాయతి గుమస్తా కోటేశ్వరరావు డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరిమధ్య ఓ ఒప్పందం కుదిరి రూ.25వేలకు బేరం కుదిరింది.
అయితే ఇలా తనకు లంచం డిమాండ్ చేసిన అధికారిపై పూర్ణంరాజు ఎసిబికి ఫిర్యాదుచేశాడు. దీంతో ముందస్తు ప్లానింగ్ లో భాగంగా ఎసిబి అధికారులు పూర్ణంరాజుతో డబ్బులు పంపించారు. వాటిని అతడు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడి ఎసిబి అడిషనల్ ఎస్పి సురేష్ బాబు పర్యవేక్షణలో జరిగింది.