ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు..
అమరావతి:పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి రివర్స్ టెండర్లను పిలవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాలన్న యోచనలో ఉన్న వాటితో పాటు 25 శాతంలోపు నిర్మాణాలు పూర్తైన ప్రాజెక్టులను కూడ రివర్స్ టెండరింగ్ పరిధిలోకి తీసుకురావాలని జగన్ సూచించారు.పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలని సీఎం అధికారులను కోరారు.
సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య ప్రాజెక్టులను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటికీ రివర్స్ టెండర్‌కు వెళ్లాలని సీఎం కోరారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులనూ ఒకే దఫాలో చేపట్టవద్దని సీఎం సూచించారు.పెండింగ్ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను ఇవ్వాల్సిందిగా కోరారు సీఎం జగన్.
ఆయా జిల్లాల వారీగా ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేయాలి... ఏ ప్రాజెక్టు నిర్మాణం ప్రాధాన్యత గురించి ప్రాధాన్యతలను గుర్తించాలని సీఎం కోరారు. ఆయా ప్రాజెక్టుల ప్రాధాన్యతల ఆధారంగా డీపీఆర్‌లను రూపొందించాలని ఆయన సూచించారు. పల్నాడు ప్రాంతంలో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టుల రూపకల్పన కోసం దిశా నిర్ధేశం చేయాలని సీఎం అధికారులకు నొక్కి చెప్పారు.
కడప జిల్లాలోని పులివెందులలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యధోరణిని వీడాలని ఆయన ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ ను ఆదేశించారు. సాగునీటి పథకాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కార్యాచరణను సిద్దం చేయాలన్నారు.
కృష్ణా నది వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులను 30 రోజుల్లో నింపేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నదికి వరదలు వచ్చినా ప్రాజెక్టులను నింపేందుకు సమయం పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణా నదికి 120 రోజులు వరద వస్తోందనే లెక్కలను సవరించాలని ఆయన సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో స్కాములు లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఒడిశా రాష్ట్రంతో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. ఈ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్ ఇరిగేషన్ అధికారులకు చెప్పారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచేలా కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల్ సామర్థ్యాన్ని 3850 నుంచి 6000 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడంపై తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిశాక కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు.ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.