తనపై కావాలనే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడ: రాజధాని అమరావతిని తరలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయ్యిందని.... అయితే ఈ తరలింపు నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగివుందని బిజెపి నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. ఇందుకు అనుకూలంగా వైసిపి అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అలా మాజీ మంత్రినయిన తనపై కూడా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మైత్రి అనే సంస్థ పేరుతో తనకు రాజధాని అమరావతిలో భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారన్నారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రావెల పేర్కొన్నారు.
గతంలో మంత్రిగా పనిచేసినప్పటికి ఇప్పటికీ తాను కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లోనే ఉంటున్నానని అన్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ కూడా కష్టతరంగా ఉందన్నారు. అలాంటిది తనకు రాజధాని ప్రాంతంలో భూములు కొనేంత స్థోమత ఎక్కడిదని... కావాలనే తనపై వైసిపి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
read more దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు... చంద్రబాబు వివరణ ఇదే
ఒక దళిత నాయకుడిగా స్వయంకృషితో ఎదిగిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబో వైసిపి నాయకులే చెప్పాలన్నారు. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ యువత బంగారు భవిష్యత్తు కు బాటలు వేసే ప్రాజెక్టని... అలాంటిదాన్ని వైసిపి ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు.
అన్నివ్యవస్థలు తమ చేతులో ఉన్నాయి కదా అని రాజధాని మార్పు సమర్ధించుకోవడానికి తనలాంటి వారిపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా మంత్రి బుగ్గనపై పరువు నష్టం కేసు వేస్తున్నట్లు...దీంతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.
read more చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు... బర్తరఫ్ చేయాలని డిమాండ్: వైసిపి ఎమ్మెల్యే
రాజధాని అనేది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేదని... కాబట్టి రాజధాని తరలింపు విషయంలో ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్దమైనట్లు తెలిపారు. కోర్టు ద్వారా తాను పంపించే నోటీసు అందినతర్వాత అయినా బుగ్గన బహిరంగ క్షమాపణ చెప్పాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. ఎస్సి, ఎస్టీ మనోభావాలు దెబ్బతినేలా స్వయంగా ఆర్థిక మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రావెల కిషోర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.