ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన మహాధర్నాలో టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పాల్గొని స్థానిక వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై విరుచుకుపడ్డారు.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి కోరుకుంటూ తాడికొండ అడ్డరోడ్డులో జేఏసి ఆధ్వర్యంలో 21వ రోజు కొనసాగుతున్న మహాధర్నాకు టిడిపి అధికార ప్రతినిధి సంఘీభావం తెలిపారు. నిరసనకారులతో కలిసి ఆమె స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ... గతంలో టిడిపి ప్రభుత్వం అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో దాదాపు 33,000 ఎకరాలు సమీకరించినా ఏ ఒక్క రోజు పోలీసులు హడావిడి లేదన్నారు. ఎప్పుడయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాజధానులు ప్రతిపాదనను ప్రకటించిందో అప్పటినుండి రాజధాని గ్రామాల్లో పోలీసుల దారుణాలు మొదలయ్యాయని అన్నారు.
rvideo శ్రీదేవి కాళ్లు పట్టుకుంటానన్నా కరగలేదు : పంచుమర్తి అనురాధ
భూసమీకరణ సమయంలో అధికార పార్టీ ఎంఎల్ఏ అయినప్పటికీ శ్రవణ్ కుమార్ రైతులు, రైతు కూలీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారని అన్నారు. కానీ ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం నెల రోజులుగా రైతులు, మహిళలు దీక్షలు, నిరసనలు, ఆందోళనలకు దిగినా కనీసం ఒక్కసారి అయినా సంఘీభావం తెలియచెయ్యకపోవడం దారుణమన్నారు.
రాజధాని ప్రజలకు అండగా నిలవాలని... వారి ఉద్యమానికి సంఘీభావం తెలపాలని తాను కోరినట్లు గుర్తుచేశారు. అందుకోసం కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడటానికి కూడా తాను సిద్దమని మీడియా ఎదుటే ప్రకటించినా ఎమ్మెల్యే శ్రీదేవి కనికరించలేదన్నారు. ప్రజల కోసం తాను చేసిన అభర్థనను ఆమె పట్టించుకోకపోవడం ప్రజలు గమనించారని... భవిష్యత్ ఆమెకు తగినరీతిలో బుద్ది చెబుతారని హెచ్చరించారు.
read more సోమవారం ఉదయమే ఏపి కేబినెట్ భేటీ... మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం
తన కులానికి చెందిన జనాభా విజయవాడలో కేవలం ఐదు శాతం మాత్రమే ఉంటారని అయినా అక్కడ మేయర్ గా గెలిపించానని అనురాధ గుర్తుచేశారు. అలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అమరావతిలో కులాల పేరుతో టిడిపి రాజకీయాలు చేస్తోందని ఆరోపించడం విడ్డూరంగా వుందన్నారు.