చంద్రబాబు అలా చేయడం బాధించింది... అందుకే బయటకు...: పోతుల సునీత

By Arun Kumar P  |  First Published Jan 24, 2020, 6:15 PM IST

ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 


తాడేపల్లి: శాసన మండలి ఔన్యత్యాన్ని చైర్మన్ కాలరాశారని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.  సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా వుందన్నారు. బిల్లు ఆగదని తెలిసి కూడా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారని... అయితే ఇది వారి తాత్కాలిక విజయమేనని అన్నారు. 

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శాసనసభను వదిలి మండలి గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. మండలి చైర్మన్ స్వేచ్చగా, రూల్స్ ప్రకారం వ్యవహరించకుండా ఆయనపై రాజకీయ ఒత్తిడి తేవడానికి చంద్రబాబు మండలికి వచ్చారని సునీత ఆరోపించారు. 

Latest Videos

గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ది రాలేదన్నారు. శాసన మండలిని చంద్రబాబు బ్రష్టు పట్టించారని... ఈ పరిణామాలు మండలి సభ్యురాలిగా  తననెంతో బాధించాయని ఆవేదన వ్యక్తం  చేశారు. 

read more  ఆ వైసిపి ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంటానన్న కనికరించలేదు..: పంచుమర్తి అనురాధ ఆవేదన

చంద్రబాబు మాయ నుంచి టీడీపీ సభ్యులు  ఇప్పటికైనా బైటకు రావాలని సూచించారు. వికేంద్రీకరణ బిల్లుకు ప్రతి మండలి సభ్యుడు మద్దతు తెలపాలని కోరారు. ఒక పార్టీకి చైర్మన్ గా షరీఫ్ వ్యవహరించారని... సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుందన్నారు. 

అభివృద్ధి, పరిపాల వికేంద్రీకరణను అడ్డుకోడానికే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని ఆరోపించారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని... ప్రలోభాలకు గురికావాల్సిన అవసరం తమకు లేదని సునీత వెల్లడించారు. మండలి రద్దుపై సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. 

శాసనమండలిలో  చట్టానికి విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారని సునీత ఆరోపించారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇవ్వడంపై టీడీపీ ఎమ్మెల్సీలు కూడా చాలా బాధ పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు విని మోసపోయామని ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. 

read more  సోమవారం ఉదయమే ఏపి కేబినెట్ భేటీ... మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం

టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన తప్పు సరిదిద్దుకోవాలని సునీత సూచించారు.మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర భవిష్యత్ కోసం రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా సీఎం జగన్ కు మద్దతు ఇవ్వాలని పోతులు సునీత కోరారు. 


 

click me!