చంద్రబాబు చాలా సున్నిత మనస్కుడు...ఆ విషయంలో ఆయనే ఛాంపియన్: పేర్ని నాని

By Arun Kumar P  |  First Published Feb 3, 2020, 9:27 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలన్ని అసత్యాలేనని మంత్రి పేర్కొన్నారు.  


అమరావతి: ఈ రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రెస్‌మీట్‌ చూస్తే ఆయన జీవితంలో మారడని అర్థమయ్యిందని రవాణ, సమాచారశాఖల మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం బాగుపడటానికి ఒక్క మంచి ఆలోచన కూడా చేయడని అర్థమవుతుందని...  జాతీయ మీడియాలో ఎవరెవరో ఏదేదో అన్నారంటూ తన తోక పత్రికల సాయంతో పరిగ మాదిరిగా ఏరుకు వచ్చిన వార్తల్ని చదివి వినిపించారని ఆరోపించారు. 

 ఈ రాష్ట్రంలో సమస్యలు తెలియని వారు చంద్రబాబు మేనేజ్‌చేస్తే నమ్మి అదే నిజం అనుకునేవారు కొద్దిమంది రాష్ట్రం బయటినుంచి ఏదో ఒకటి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కానీ 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు ఏరోజూ ప్రస్తావించరని... అభివృద్ధికి ఆయనే ఛాంపియన్‌ అయితే ఏపీ ప్రజలు ఎనిమిది నెలల క్రితం ఎందుకు ఉతికి ఆరేశారని నిలదీశారు. 

Latest Videos

undefined

ఎనిమిది నెలలుగా జగన్‌ ప్రభుత్వం చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా అమలు చేస్తున్న స్కీములు దాదాపు 90 శాతం కుటుంబాలకు సంతోషాన్నిస్తుంటే చంద్రబాబుకు ఇక్కడి ప్రజల మనోభావాలతో పని లేనట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. నేషనల్‌ మీడియాలో ఎక్కడో ఉన్న వారు ఏం రాశారు? ఏం మాట్లాడారు అనేది పిక్‌ అండ్‌ ఛూజ్‌గా ఏరుకుని ప్రదర్శించారని విమర్శించారు.

చంద్రబాబు దుర్మార్గాల మీద రాష్ట్ర ప్రజల్ని మాట్లాడిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న స్టోరేజీ డివైస్‌లు సరిపోవన్నారు. వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే ఛాంపియన్‌ చంద్రబాబు నిజాయతీ నటిస్తూ గొప్ప ఆడియో విజువల్‌ డ్రామా ఆడారని మండిపడ్డారు. అందులో రేవంత్‌రెడ్డి డబ్బుల మూట విజువల్స్, తన బ్రీఫ్డ్‌ మీ ఆడియో కూడా వేసి ఉంటే మరింత బాగుండేదని మంత్రి ఎద్దేవా చేశారు.  

read more  నారావారిపల్లెలో వైసీపీ సభ: చంద్రబాబు స్పందన ఇదీ

చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల మనోభావాలు తన జీవితంలో అర్థం కావన్నారు. ఆయనకు నేషనల్‌ మీడియా ఏమంటోంది? టైం మ్యాగజీన్‌లో తన గురించి ఏం వస్తే బాగుంటుందన్న ఆలోచనే ముఖ్యమన్నట్లుగా వుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి డబ్బులు కొల్లగొట్టటంతో పాటు వేరే దేశాల ప్రయోజనాలకు ఏ మాత్రం దెబ్బతగిలినా తట్టుకోలేని సున్నితమైన మనిషి ఆయన అంటూ సెటైర్లు వేశారు.

ఈయేడాది దావోస్‌లో స్విస్‌ బ్యాంకు అకౌంట్లు సరి చూసుకునేందుకు అవకాశం లేకపోయిందని ఆయన బాధపడుతున్నారా అన్నది కూడా తేలాలన్నారు. మూడు ప్రాంతాలకూ ఎందుకు అన్యాయం చేశావంటే మాట్లాడడు, అమరావతిలో అయిదేళ్లలో ఏం కట్టారంటే మాట్లాడడు, మూడు ప్రాంతాలకూ మీరు చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు కాలేదంటే మాట్లాడడు, మీరు అమరావతిని అభివృద్ధి చేస్తే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎందుకు ఓడారంటే మాట్లాడడు, కనీసం ల్యాండ్‌ పూలింగ్‌ ఏరియాలో డ్రైనేజీ వేయగలిగారా అంటే నోరెత్తడు కానీ తానే అభివృద్ది చేశానంటూ ప్రచారం చేసుకుంటాడని ఆరోపించారు.

హైదరాబాద్‌ తొమ్మిదేళ్లలో తానే డెవలప్‌ చేశానంటున్న మనిషి అయిదేళ్లలో మోడీగారి శంకుస్థాపన రాయి దగ్గర పిచ్చి మొక్కలు మాత్రమే ఎందుకు మిగిలాయంటే ఆయన నోరు పెగలటం లేదన్నారు. రోడ్లు లేవు, నీటి పైపులు లేవు, కరెంటు లైన్లు లేవు, ప్లాట్లు డెవలప్‌ చేయలేదు, రైతులకు ప్లాట్లు ఇవ్వకుండానే  2000 ఎకరాలు అమ్మేశాడన్నారు. దీనికి అభివృద్ధి అని పేరు పెట్టాడని ఎద్దేవా చేశారు. 

శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయటం అవసరం అని జగన్‌ అంటే రాయలసీమలో పుట్టి కూడా ఆ ఒప్పందాన్ని బాబు వ్యతిరేకిస్తున్నాడని విమర్శించారు. విశాఖలో సెక్రటేరియట్‌ పెడతాం అంటే కాదూ కూడదంటాడు... మరి ఉత్తరాంధ్రకు ఎలా న్యాయం చేయగలుగుతాం? అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన నగరంలో రాజధాని ఉంటే ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు భారీగా పెట్టుబడుల అవసరం ఉండవని శంఖం ఊదుతున్నా ఆయనకు వినిపించటం లేదని మండిపడ్డారు. 

read more  మైనింగ్ లీజుల వసూళ్ళు ప్రైవేటుకు... ఏపి సర్కార్ సంచలన నిర్ణయం

పెట్టుబడిదారుల్ని బెదరగొట్టేలా చంద్రబాబు కరప్షన్‌ అంతర్జాతీయ స్థాయికి చేరిందని... ఆయన సీఎంగా ఉండగానే జపాన్‌ సంస్థ మాకీ అసోసియేట్స్‌ పెద్ద ఉత్తరం రాసి మరీ ఛీ కొట్టిందని గుర్తుచేశారు. ఇలాంటివి ఆయన వెంటనే తన మెమరీ నుంచి డిలీట్‌ కొడతాడని... ఇంతకీ ఆయన బినామీ భూముల కోసమే మూడు గ్రామాల ఉద్యమం అవునా కాదా అంటే చంద్రబాబు సమాధానం ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు.
 
ప్రజావేదిక ఏం పాపం చేసిందని బాబు అమాయకంగా అడిగారని... నదిలో కట్టకూడదన్న జ్ఞానం ఆయనకు ఇప్పటికి కూడా రాలేదని అర్థమవుతోందన్నారు. అలాంటి కట్టడం కట్టినందుకు మొత్తం సొమ్ము చంద్రబాబు ఆస్తులు ఎటాచ్‌ చేసి రాబట్టాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. 

 

click me!