ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్ ప్రకటన ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడిని సృష్టించింది. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు,, ఎంపీ సుజనా చౌదరి కూడా దీనిపై స్పందిస్తూ సీఎంకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
అమరావతి: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత ఇక్కడి ప్రజలు, పాలకులు ఉట్టిచేతులతో అమరావతి వచ్చేశామని... ఎంతో శ్రమకోర్చి ఈ నగర అభివృద్దికి ప్రతిఒక్కరు పాటుపడ్డారని రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు సుజనా చౌదరి గుర్తుచేశారు. అలాంటి ప్రాంతంనుండి రాజధానికి మరోచోటికి మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు.
ఇప్పటికే అమరావతికి ఓ గుర్తింపు వచ్చిందని... కేంద్రం కూడా ఈ నగరాన్ని గుర్తించిందన్నారు. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యంమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తామనడం అనాలోచిత నిర్ణయంగా పేర్కొన్నారు. చిన్నపిల్లల ఆటలా రాజధానిని మార్చుతామంటే కుదరదని సుజనా చౌదరి హెచ్చరించారు.
ఏపీ రాజధానిని మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడం ఖాయమన్నారు. అందువల్ల ముఖ్యమంత్రి జగనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బావుంటుందన్నారు.
read more ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన రాజధాని అమరావతికి మారిన సమయంలో ఏపి సచివాలయ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారని గుర్తుచేశారు. అలా వారు ఎంతో శ్రమకోర్చి అమరావతిలో పనిచేశారని...ఇప్పుడు వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామన్నారు.
సీఎం జగన్ ఇష్టంవచ్చినట్టు వ్యవహరించడం సరికాదని ఎంపీ హితవు పలికారు. రాజధానిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితమని... ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపి రాజధాని అమరావతిలోనే ఉంటుందని... రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయమోనన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతిపై శీతాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందన్నారు. ఈ క్రమంలో అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న సంగతిని జగన్ గుర్తుచేశారు.
పాలన ఒక దగ్గర, జూడీషియల్ ఒక దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని దీని ఆధారంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
read more రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
అమరావతికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 5 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని జగన్ ఆరోపించారు. రూ.5,080 కోట్లకు సంబంధించి దానిపై వడ్డీనే రూ.700 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. లక్షా 9 వేల కోట్ల రూపాయల ప్రణాళికలో మిగిలిన పెట్టుబడి పెట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సైతం అద్భుతమైన రాజధానిని నిర్మించాలని ఉందని తెలిపారు.
విశాఖలో ఇప్పటికే అన్నీ వున్నాయని.. ఒక మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మిస్తే సరిపోతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.