తన సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసును సిబిఐ కి అప్పగించడానికి ముఖ్యమంత్రి జగన్ ఎందుకంత వెనుకాడుతున్నారో అర్థం కావడంలేదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆయన వ్యవహారశైలి చూస్తే ఈ హత్యతో సంబంధముందన్న అనుమానం కలుగుతోందన్నారు.
గుంటూరు: సొంతబాబాయి హత్యకేసుని సీబీఐకి అప్పగించడానికి జగన్ ఎందుకు తాత్సారం చేస్తున్నాడని, వైఎస్ వివేకా కుమార్తె, భార్య హైకోర్టుకు వెళ్లినా దానిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
వివేకా హత్యకేసులో జగన్‌పాత్ర ఉందన్న అనుమానం నానాటికీ బలపడుతోందని, కేసు విచారణలో జగన్ వైఖరి చూస్తుంటే ప్రజల అనుమానాలకు బలం చేకూరుతోందని వెంకన్న స్పష్టం చేశారు. వివేకా కుటుంబసభ్యులు సీబీఐ విచారణ కోరుతుంటే, జగన్ సిట్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు.
వివేకా తన ఇంట్లోనే హత్య గావించబడిన తీరుచూసి రాష్ట్రమంతా చలించినా కొడుకు తర్వాతి కొడుకైన జగన్ ఎందుకు మిన్నకుండిపోయాడో తెలియడంలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక వివేకా హత్యకేసు నత్తనడకన సాగుతోందని ఆయన కుటుంబసభ్యులే చెబుతున్నారని వెంకన్న తెలిపారు. తన తండ్రి హత్యకేసుని సీబీఐకి అప్పగించాలని వీలైనంత త్వరగా దోషుల్ని పట్టుకోవాలని సునీత కోరినా, జగన్ స్పందించనందునే ఆమె కోర్టు తలుపు తట్టిందన్నారు.
read more జగన్ పాలన మరో ఏడాదే... ఆ తర్వాత జైలుకే...: దేవినేని ఉమ సంచలనం
మడమతిప్పని వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్న జగన్ వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి సహా ఇతర కుట్రదారులకు ఎందుకు కొమ్ముకాస్తున్నాడని వెంకన్న నిలదీశారు. ముఖ్యమంత్రి వైఖరి, కేసు విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలతోపాటు జగన్ ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోందన్నారు.
ఎవరికీ భయపడని, ఎవర్నీ లెక్కచేయని జగన్, తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయించడానికి ఎందుకు వెనకాడుతున్నాడని నిలదీశారు. విచారణను సీబీఐకి అప్పగిస్తే తనవారితో పాటు తనపేరు కూడా బయటపడుతుందన్న అనుమానం జగన్‌లో ఉందని బుద్ధా పేర్కొన్నారు. 2014ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇవ్వాలని భాస్కర్‌రెడ్డి కోరాడని, అప్పటినుంచే వివేకాతో వారికి మనస్పర్ధలు ప్రారంభమయ్యాయని బుద్ధా తెలిపారు.
వివేకా హత్య జరిగిన తీరుచూస్తుంటే, ఆయనను చంపినవారు ఆయనపట్ల ఎంత కసితో ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఒంటినిండా గొడ్డలి గాట్లతో ఉన్నవ్యక్తి, గుండెపోటుతో మృతిచెందాడని చెప్పించారని, వివేకా మృతదేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు జగన్ కంటినుంచి ఒక్కచుక్కకూడా కన్నీరు రాలేదన్నారు.
read more ఏపిలో కొత్త పారిశ్రామిక విధానం...ఉపాధి, సాంకేతికత, ఆదాయం పెంపే లక్ష్యం: మంత్రి మేకపాటి
దివంగత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు తన తమ్ముడు వివేకా చాలా మంచివాడని చెప్పారన్నారు. అధికారముంది కదా అని రైతుల్ని, మహిళల్ని, ప్రతిపక్షసభ్యుల్ని వేధిస్తున్న జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తనచెల్లి, చిన్నమ్మ చేసిన అభ్యర్థనపై వెంటనే స్పందించి వివేకా హత్యకేసుని సీబీఐకి అప్పగించాలన్నారు. జగన్ తీరు మారకుంటే వివేకా హత్యకేసుని జనంలోకి తీసుకెళతామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు దోషుల్ని చట్టంముందు నిలబెడతామని వెంకన్న తేల్చిచెప్పారు.
మండలిరద్దుచేయడంద్వారా జగన్ ప్రజలముందు మండలిసభ్యులను హీరోలను, త్యాగ పురుషుల్ని చేశాడని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుద్ధా అభిప్రాయపడ్డారు. జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మండలిలో ఉన్న తన ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించి మండలి ని రద్దుచేసి ఉండాల్సిందన్నారు.